NTV Telugu Site icon

Mayank Yadav: నువ్వేం ప్రత్యేకంగా చెయ్యొద్దన్నాడు.. అసలు విషయం చెప్పిన మయాంక్‌ యాదవ్!

Mayank Yadav

Mayank Yadav

Mayank Yadav About Gautam Gambhir: మయాంక్‌ యాదవ్.. ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఎక్కువగా మార్మోగుతున్న పేరు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ.. బ్యాటర్లను భయపెడుతుండడమే అందుకు కారణం. గాయం నుంచి కోలుకొని నేరుగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ పేస్‌ సంచలనం.. ఆదివారం గ్వాలియ‌ర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టీ20లో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. అంతేకాదు తొలి మ్యాచ్‌ మొదటి ఓవర్‌నే మెయిడిన్‌ చేసి సంచలనం సృష్టించాడు.

అరంగేట్ర మ్యాచ్‌ కావడంతో తాను కాస్త ఆందోళనకు గురయ్యానని.. కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్, హెడ్ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మద్దతుగా నిలిచారని మయాంక్‌ యాదవ్ తెలిపాడు. అనవసరంగా ఒత్తిడికి గురికావద్దని, అదనంగా ఏం చేయక్కర్లేదని గౌతీ సూచనలు చేశాడని తెలిపాడు. ‘మ్యాచ్‌కు ముందు గౌతమ్‌ గంభీర్‌ నాతో మాట్లాడాడు. నువ్వేం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. బేసిక్స్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేయమని, మరీ ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పాడు. విభిన్నంగా బౌలింగ్‌ చేయాలని ప్రయత్నించొద్దని, అలా చేస్తే సహజంగా వచ్చిన బౌలింగ్‌ యాక్షన్‌ దెబ్బతినే అవకాశం ఉంటుందని సూచించాడు. ఇది నీ మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ కాబట్టి ఒత్తిడిగా ఫీల్‌ కావద్దని చెప్పాడు’ అని మయాంక్‌ చెప్పుకొచ్చాడు.

Also Read: Preity Zinta Dream: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రీతీ జింటా కల నెరవేరిందోచ్!

‘తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడంతో ఉత్సాహంగానే ఉన్నా. కానీ కాస్త ఆందోళన కూడా ఉంది. బౌలింగ్ ఎలా ప్రారంభించాలి?, ఎలాంటి బంతులు వేయాలి? అని ఆలోచించా. గాయం కారణంగా ఇటీవల పెద్దగా ఆడలేకపోయా. నేరుగా అంతర్జాతీయ అరంగేట్రం చేశా. అందుకే కాస్త ఒత్తిడిగా ఫీలయ్యా. ప్రస్తుతం నా శరీరంపై ఎక్కువ దృష్టిపెడుతున్నా. వేగంగా బంతులేయడం కంటే.. సరైన లెంగ్త్‌ ముఖ్యమని తెలిసింది. స్పీడ్‌ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎక్కువ పరుగులు ఇవ్వకుండా.. బౌలింగ్‌ చేయాలనే దానిపైనే దృష్టిపెట్టా. కెప్టెన్‌తో మాట్లాడి ఐపీఎల్‌లో చాలాసార్లు స్లో బంతులు వేశా. ఈ మ్యాచ్‌లో బౌన్స్‌కు ఎక్కువ సహకారం లభించలేదు. దాంతో నా పేస్‌ను మార్చుకున్నా’ అని మయాంక్‌ చెప్పాడు.

Show comments