Kanpur stadium C Stand in Dangerous: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ స్టేడియంలో శుక్రవారం నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది. 2021 తర్వాత కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టు ఇదే కావడం విశేషం. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో మ్యాచ్ చూసేందుకు ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అయితే కాన్పూర్ స్టేడియంలోని పరిస్థితులపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంలోని ఓ స్టాండ్ బలహీనంగా ఉండటమే ఇందుకు కారణం.
కాన్పూర్ స్టేడియంలోని ఒక స్టాండ్ బలహీనంగా ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ తెలిపిందని ఒక జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. అభిమానులు ఆ స్టాండ్‌లో పూర్తిస్థాయిలో నిండితే.. కూలిపోయే ప్రమాదముందని వెల్లడించారట. అందుకే స్టాండ్‌లో సగానికంటే తక్కువగా టికెట్లు విక్రయిస్తున్నట్లు సదరు మీడియా పేర్కొంది. బాల్కనీ సీ స్టాండ్‌లో సమస్యలు ఉన్న కారణంగా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయట. ఈ స్టాండ్ కెపాసిటీ 4,800 కాగా.. 1,700 టికెట్లు మాత్రమే అమ్ముతారని తెలుస్తోంది.
బాల్కనీ సీ స్టాండ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మ్యాచ్ జరిగే సమయంలో దానిని మూసివేయాలని యూపీ క్రికెట్ అసోసియేషన్‌ను పీడబ్లూడీ ఇంజినీర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బ్యాటర్లు భారీ సిక్స్ కొట్టినప్పుడు అభిమానులు ఎగిరి గంతేస్తే.. 50 మంది ప్రేక్షకుల బరువును కూడా ఈ స్టాండ్ మోయలేదని ఇంజినీర్ చెప్పాడట. బాల్కనీ సీ స్టాండ్‌కు వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన సూచించాడట.