NTV Telugu Site icon

Rohit Sharma: దుబాయ్‌ మా సొంతగడ్డ కాదు.. అన్నీ ఆలోచించి బరిలోకి దిగుతాం!

Rohit Sharma Press Meet

Rohit Sharma Press Meet

దుబాయ్‌ తమ సొంతగడ్డ కాదు అని, ఇక్కడ భారత్ ఎక్కువ మ్యాచ్‌లేమీ ఆడలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దుబాయ్‌ పిచ్‌ ప్రతిసారీ భిన్న సవాళ్లను విసురుతోందని, తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కోసారి ఒక్కో రకంగా స్పందించిందన్నాడు. దుబాయ్‌ మైదానంలో నాలుగు పిచ్‌లు ఉన్నాయని, సెమీ ఫైనల్‌ దేనిపై ఆడిస్తారో తెలియదని హిట్‌మ్యాన్ చెప్పాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భారత్ ఒకే మైదానంలో ఆడుతోందని, భారీ లాభం పొందుతోందని కొందరు మాజీలు, క్రికెటర్లు అంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో సెమీస్‌ పోరుకు ముందు మీడియా సమావేశంలో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘దుబాయ్‌ పిచ్‌ భిన్న సవాళ్లను విసురుతోంది. భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కో రకంగా స్పందించింది. దుబాయ్‌ మా సొంతగడ్డ కాదు. మేం ఇక్కడ ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. మాకూ ఈ మైదానం కొత్తే. ఇక్కడ నాలుగు పిచ్‌లు ఉన్నాయి. సెమీ ఫైనల్‌ ఏ పిచ్‌పై ఆడిస్తారో తెలియదు. అయితే ఎక్కడ ఆడినా.. పరిస్థితులకు తగ్గట్లు అన్వయించుకోవడం కీలకం. సెమీస్‌లో ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. ఆస్ట్రేలియా మంచి ప్రత్యర్థి. కఠిన సవాల్ తప్పదు. గత మూడు మ్యాచ్‌లలో ఎలా ఆడామో.. ఈ మ్యాచ్‌లోనూ అలానే ఆడతాం. న్యూజిలాండ్‌పై వరుణ్‌ చక్రవర్తి ప్రదర్శన చేశాడు. సెమీస్‌లోనూ నలుగురు స్పిన్నర్లతో ఆడాలన్న ఉత్సాహం కలుగుతోంది. కూర్పు పరంగా తలనొప్పి తప్పదు. అన్నీ ఆలోచించి సరైన కూర్పుతోనే బరిలోకి దిగుతాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు.

వరుణ్‌ చక్రవర్తి మాత్రమే కాదు భారత స్పిన్నర్లంతా నాణ్యమైన స్పిన్నర్లే అని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ అన్నాడు. భారత్ స్పిన్నర్ల బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటామన్నదే సెమీస్ మ్యాచ్‌లో కీలకం అని, స్పిన్‌ను ఆడడం తమకు సవాలే అని పేర్కొన్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో నేడు జరిగే మొదటి సెమీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 ఆరంభం కానుంది. స్టార్‌ స్పోర్ట్స్, స్పోర్ట్స్‌-18లో లైవ్ మ్యాచ్ రానుంది.