Site icon NTV Telugu

IND vs AUS: పెర్త్ టెస్టుకు అరుదైన ఘనత.. 1947 తర్వాత ఇదే మొదటిసారి!

Cummins Bumrah

Cummins Bumrah

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ సమయంలోనే పెర్త్ టెస్టుకు ఓ అరుదైన ఘనత దక్కింది. క్రికెట్ చరిత్రలో ఈ రెండు జట్లకు ఫాస్ట్ బౌలర్లు కెప్టెన్లుగా వ్యవహరించడం ఇదే తొలిసారి. 1947 తర్వాత తొలిసారి ఇరు జట్ల సారథులూ బౌలర్లే కావడం ఇదే మొదటిసారి. భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా, ఆసీస్‌కు ప్యాట్ కమిన్స్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

2021 చివరి నుండి ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఉన్నాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రాకు జట్టు పగ్గాలు దక్కాయి. 1947/48లో ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఆసీస్ జట్టుకు నాయకత్వం వహించగా.. భారత కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ లాలా అమర్‌నాథ్ ఉన్నారు. ఒక టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన చివరి భారత ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్. అతను 1985-86 పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహించారు.

ఇక పెర్త్ టెస్టులో భారత్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. జట్టులోకి కుర్రాళ్లు నితీశ్‌ రెడ్డి, హర్షిత్ రాణాలు వచ్చారు. వేలికి గాయం నుంచి కోలుకోని గిల్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతిని ఇవ్వగా.. అతడి స్థానంలో దేవ్‌దత్‌ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు వరుస షాకులు తగిలాయి. లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్లకు 54 రన్స్ మాత్రమే చేసింది.

 

Exit mobile version