Pat Cummins Heap Praise on Travis Head after IND vs AUS Final 2023: వన్డే ప్రపంచకప్ 2023 లక్ష్య ఛేదనలో తన గుండె దడ పెరిగిందని.. అయితే ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ అసాధారణ బ్యాటింగ్ దానిని తగ్గించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. తమ అత్యుత్తమ ప్రదర్శనను ఫైనల్ మ్యాచ్ కోసం దాచి ఉంచినట్లుందని, కీలక మ్యాచ్‌లలో ఆడే సత్తా ఉన్నవారంతా సరైన సమయంలో ఆడారన్నాడు. పిచ్ నెమ్మదిగా ఉందని, తాము అనుకున్నంత ఎక్కువగా స్పిన్ కాలేదని కమిన్స్ చెప్పాడు. తన సారథ్యంలో ఆసీస్ వన్డే ప్రపంచకప్ గెలవడం చాలా సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ పేర్కొన్నాడు. ఆదివారం టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచి.. ఆరోసారి ప్రపంచకప్ గెలిచింది.
ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘మా అత్యుత్తమ ప్రదర్శనను ఫైనల్ కోసం దాచి ఉంచినట్లుంది. ఇద్దరు కీలక ప్లేయర్‌లు సరైన సమయంలో సత్తాచాటారు. మొత్తం టోర్నమెంట్‌లో మేము ముందుగా బ్యాటింగ్ చేశాం. అయితే ఈ రోజు చేజింగ్ చేయడం బాగుంటుందని అనుకున్నాం. నేను అనుకున్నదానికంటే పిచ్ కాస్త నెమ్మదిగా ఉంది. ఎక్కువగా స్పిన్ కాలేదు. అందరూ బాగా ఆడారు. మా పేసర్లు కొన్ని టైట్ లైన్స్ బౌలింగ్ చేశారు. స్లో వికెట్ కాబట్టి లెగ్‌సైడ్‌లో మంచి ఫీల్డర్లను ఉంచాం. మా ఫీల్డింగ్ అద్భుతం. దక్షిణాఫ్రికా మ్యాచులో మా ఫీల్డింగ్ సూపర్. అది ఫైనల్లో కొనసాగించాం’ అని తెలిపాడు.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఆస్ట్రేలియా ప్రపంచకప్ హీరో!
‘జట్టులో ఎక్కువ వయస్సున్న వాళ్లు ఉన్నా అందరూ రాణించారు. ఈ వికెట్‌పై 300 స్కోర్ కష్టమని అనుకున్నాం. అందుకే టీమిండియాను 300లోపు కట్టడి చేద్దామనుకుంటే.. 240కే ఆపగలిగాం. అందరిలానే ఛేదనలో నా గుండె దడ కూడా పెరిగింది. కానీ హెడ్, లబుషేన్ జట్టును గెలిపించారు. హెడ్ బౌలర్లపై కొంత ఒత్తిడిని తెచ్చి పైచేయి సాధించాడు. చేయి విరిగిన తర్వాత కూడా హెడ్‌పై మేం నమ్మకం ఉంచి జట్టుతో కొనసాగించడం కలిసొచ్చింది. అతను ఒక లెజెండ్. మైదానంలో భారత అభిమానులను మౌనంగా ఉంచినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆటపై విపరీత అభిమానం చూపించే భారత గడ్డపై మ్యాచ్ ఆడటమే ఒక మంచి జ్ఞాపకం. అలాంటి గడ్డపై ప్రపంచకప్ గెలుచుకోవడం అద్భుతమైన అనుభూతి. ఈ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోను’ అని కమిన్స్ పేర్కొన్నాడు.