Site icon NTV Telugu

AUS vs IND: స్టీవ్ స్మిత్ సెంచరీ.. లంచ్ బ్రేక్‌కు ఆస్ట్రేలియా స్కోరు 454/7!

Steven Smith Century

Steven Smith Century

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆసీస్ బ్యాటర్లు మొదటి రోజులో హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. రెండో రోజులో కూడా చెలరేగి ఆడుతున్నారు. ఈ క్రమంలో రెండో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఆస్ట్రేలియా 454/7 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ (139), మిచెల్ స్టార్క్ (15) ఉన్నారు. ఈ సెషన్‌లో ఆసీస్‌ బ్యాటర్లు 27 ఓవర్లలో 143 పరుగులు చేయడం విశేషం. భారత బౌలర్లు ఒక్క వికెట్‌ మాత్రమే తీసి పూర్తిగా నిరాశపరిచారు.

ఓవర్‌నైట్ 311/6 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా దూకుడుగా ఆడింది. స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్ (49) ధాటిగా ఆడారు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఆచితూచి ఆడిన ఈ ఇద్దరు.. మహమ్మద్ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ల బౌలింగ్లో పరుగులు రాబట్టారు. కమిన్స్‌తో కలిసి స్మిత్ ఏడో వికెట్‌కు ఏకంగా 112 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను మార్చినా లాభం లేకపోయింది. చివరికి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీషాట్‌ ఆడిన కమిన్స్‌.. నితీశ్‌ రెడ్డి సూపర్‌ క్యాచ్‌కు పెవిలియన్‌ చేరాడు.

Also Read: IND vs AUS: లబుషేన్‌తో రోహిత్‌ శర్మ వాదన.. జోక్యం చేసుకోని అంపైర్లు!

కమిన్స్‌ అవుట్ స్టీవ్ స్మిత్ వేగంగా ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం స్మిత్ మరింత రెచ్చిపోయాడు. దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాడు. మరోవైపు మిచెల్ స్టార్క్ అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. స్మిత్ ఇప్పటికే స్టార్క్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఆసీస్‌ భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది. స్కోరు 500 దాటాక ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది.

Exit mobile version