భారత జట్టుకు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కొరకరాని కొయ్యగా మారాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ కొంపముంచిన హెడ్.. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2-24-25లోనూ విజయాలను దూరం చేస్తున్నాడు. అడిలైడ్ టెస్టులో సెంచరీ చేసిన అతడు బ్రిస్బేన్ టెస్టులో శతకం బాదాడు. వన్డే తరహాలో 160 బంతుల్లో 152 పరుగులు చేశాడు. టీమిండియాకు సింహస్వప్నంలా మారిన హెడ్.. జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా అద్భుత బౌలర్ అని, మూడో టెస్టు రెండో రోజు ఆటలో అతడి స్పెల్‌ను కాచుకోవడం తన అదృష్టమని హెడ్ పేర్కొన్నాడు.
రెండో రోజు ఆట ముగిసిన అనంతరం ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ… ‘సెంచరీ చేసినందుకు సంతోషంగా ఉంది. అయితే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొని పరుగులు చేయడం మరింత ఆనందంగా ఉంది. అదృష్టవశాత్తూ బుమ్రా ఉత్తమ స్పెల్‌ను దాటి బ్యాటింగ్ కొనసాగించా. ఆరంభంలో స్టంప్స్‌కు బంతులు వేశాడు. ఆపై బౌన్సర్లు సంధించాడు. బుమ్రా దగ్గర వికెట్లు తీసేందుకు అన్ని అస్రాలు ఉన్నాయి. అతని బౌలింగ్‌లో సానుకూల దృక్పథంతో ఆడాలని చూస్తా. అంటే బుమ్రా బౌలింగ్‌లో పరుగులు చేయాలని కాదు, ఫార్వర్డ్ డిఫెన్స్‌తో బంతిని అడ్డుకోవడం. భారత్‌తో నిత్యం క్రికెట్ ఆడుతూనే ఉంటాం. మంచి జట్టుపై పరుగులు చేయడం బాగుంటుంది. ఈ వారం నా ప్రదర్శన మరింత ప్రత్యేకం అనే చెప్పాలి. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌ను ఆస్వాదించా’ అని చెప్పాడు.