బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2-24-25లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ 405/7 స్కోరుతో మూడో రోజైన సోమవారం ఆట ప్రారంభించిన ఆసీస్.. మరో 40 పరుగులు జోడించి మూడు వికెట్స్ కోపోయింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (70) హాఫ్ సెంచరీ చేశాడు. రెండోరోజు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101)లు సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్స్ పడగొట్టగా.. సిరాజ్ 2, నితీశ్ రెడ్డి 1, ఆకాశ్ దీప్ 1 వికెట్ తీశారు.
బ్రిస్బేన్‌లో వర్షం కారణంగా మొదటి రోజు ఆట సజావుగా సాగని విషయం తెలిసిందే. రెండో రోజు వరణుడు కరుణించాడు. అయితే ఆదివారం ఆట పూర్తయ్యాక వర్షం పడింది. దీంతో మైదానం చిత్తడిగా మారడంతో నేడు ఆట 5 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. మిచెల్ స్టార్క్ (18), అలెక్స్ కేరీలు వేగంగా పరుగులు చేశారు. స్టార్క్ ఔట్ అయిన కాసేపటికి మళ్లీ వర్షం ఆటకు ఆటంకం కలిగించింది. ఆట మొదలయ్యాక నాథన్ లైయన్‌ను సిరాజ్.. కేరీని ఆకాశ్ పెవిలియన్‌కు చేర్చాడు.
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మొదటి బంతికే బౌండరీ బాదిన ఓపెనర్ యశస్వి జైస్వాల్.. రెండో బంతికి ఔట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చాడు. స్టార్క్ తన రెండో ఓవర్ మొదటి బంతికే శుభ్‌మన్ గిల్ (1) ఔట్ చేశాడు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (3).. హాజిల్‌వుడ్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని ఆడి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 22 పరుగులకే మూడు వికెట్స్ కోల్పోయి కష్టాలో పడింది.