భారత జట్టుకు శుభవార్త. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. ప్రస్తుతం అడిలైడ్‌లో ఉన్న భారత జట్టుతో కలిశాడు. టీమిండియా ఆటగాళ్ల సన్నద్ధతను దగ్గరుండి చూసుకుంటున్నాడు. అదే సమయంలో రెండో టెస్టు తుది జట్టుపై ప్రణాళికలు మొదలు పెట్టాడు. యశస్వీ జైస్వాల్‌తో కలిసి ఎవరిని ఓపెనర్‌గా పంపాలని మల్లగుల్లాలు పడుతున్నాడు. అయితే ఈ విషయంలో ఇప్పటికే గంభీర్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పెర్త్ టెస్టు ముగిసాక బీసీసీఐ అనుమతి తీసుకుని గౌతమ్ గంభీర్ భారత్‌కు వచ్చాడు. అడిలైడ్‌లో జరిగే డే/నైట్ టెస్టుకు ముందే తాను తప్పనిసరిగా అందుబాటులో ఉంటానని బీసీసీఐకి చెప్పాడు. చెప్పినట్టుగానే మూడు రోజుల ముందు ఆసీస్ చేరుకుని.. జట్టు సన్నాహకాలను పరిశీలించాడు. గౌతీ గైర్హాజరీలో ప్రైమ్ మినిష్టర్స్ XI తో జరిగిన వార్మప్ మ్యాచ్‌కు అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్.. బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ టీమ్ కోచింగ్ బాధ్యతలను చూసుకున్నారు.
Also Read: Gold Rate Today: గోల్డ్ ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర!
ఐదు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతుంది. వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ, గాయంతో శుభ్‌మన్ గిల్ తొలి టెస్టుకు దూరం కాగా.. ఇద్దరు ఇప్పుడు అందుబాటులోకి వచ్చారు. యశస్వీ జైస్వాల్‌తో కలిసి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లలో ఎవరు ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారో చూడాలి. కోచ్ గౌతమ్ గంభీర్ తుది జట్టుపై ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.