భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య గురువారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే మొహాలిలో ప్రాక్టీస్ చేస్తున్న అఫ్గానిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా రషీద్ టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్ ధృవీకరించాడు.
వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం రషీద్ ఖాన్ క్రికెట్ ఆడలేదు. మెగా టోర్నీ ముగిసిన వెంటనే అతడు వెన్ను నొప్పికి సర్జరీ చేయించుకున్నాడు. దాంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడు.ఆపై అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)కి కూడా దూరమయ్యాడు. భారత పర్యటనను దృష్టిలో పెట్టుకుని రషీద్‌ను జట్టులోకి తీసుకున్నా.. అతడు ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దాంతో టీమిండియాతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
Also Read: Rohit Sharma: మరో 44 పరుగులు.. టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ!
భారత్‌లో పిచ్‌లపై మంచి అవగాహన ఉన్న రషీద్ ఖాన్ తప్పుకోవడం అఫ్గానిస్థాన్ జట్టుకు ఎదురుదెబ్బే. అయితే భారత్‌కు ఇది గుడ్ న్యూస్. స్పిన్ మాయాజాలంలో ఇబ్బంది పెట్టే రషీద్ లేకపోవడంతో అఫ్గాన్ బౌలింగ్ విభాగం బలహీనంగా మారనుంది. ఇక మొహాలీలో జనవరి 11న మొదటి టీ20 జరగనుండగా.. 14, 17 తేదీల్లో ఇండోర్, బెంగళూరుల్లో మిగిలిన మ్యాచ్‌లు జరగనున్నాయి.
