NTV Telugu Site icon

IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన భారత్! కళ్లన్నీ కోహ్లీపైనే

Kohli, Nabi

Kohli, Nabi

IND vs AFG 2nd T20 Prediction and Playing 11: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి టీ20లో గెలిచిన రోహిత్ సేన.. సిరీస్‌పై కన్నేసింది. రెండో టీ20లో గెలిచి మరో మ్యాచ్ ఉండగానే.. సిరీస్ పట్టేయాలని చూస్తోంది. ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, చిన్న బౌండరీలు ఉండడంతో హోల్కర్‌ స్టేడియంలో పరుగుల వరద ఖాయం. స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

భారత తుది జట్టులో స్వల్ప మార్పులు జరగనున్నాయి. గత మ్యాచ్‌ ఆడని స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ నేడు బరిలోకి దిగుతున్నాడు. 2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో అఫ్గాన్‌పైనే సెంచరీతో సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు విరాట్ ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే జట్టుపై రాణించి.. టీ20 జట్టులో తన ఎంపిక సరైందేనని చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. విరాట్ రాకతో హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. తొలి టీ20లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీతో ఆకట్టుకున్నా.. బ్యాటింగ్‌లో పరుగులు చేయలేకపోయాడు. దాంతో రోహిత్, కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది.

ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ గాయం నుంచి కోలుకుంటే తుది జట్టులోకి వస్తాడు. లేదంటే శుభ్‌మన్‌ గిల్‌కు మరో అవకాశం దక్కుతుంది. తొలి టీ20లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన శివమ్‌ దూబెపై మరోసారి అందరి దృష్టి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జితేశ్‌ శర్మ, రింకు సింగ్‌లు మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. గత మ్యాచ్‌లో విఫలమైన సుందర్ స్థానంలో కుల్దీప్ వచ్చే అవకాశం ఉంది. యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ కూడా 11కు పైగా ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. తన సొంత మైదానంలో అవేశ్‌ను ఆడించాలనుకుంటే రవి డగౌట్‌కే పరిమితం చేయొచ్చు.

తొలి టీ20ల్లో మంచి ప్రదర్శనే చేసిన అఫ్గానిస్థాన్‌.. ఈ మ్యాచ్‌లో కూడా పోటీ ఇవ్వనుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మరింత మెరుగ్గా రాణించి.. పుంజుకోవాలని చూస్తోంది. గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, ఒమర్‌జాయ్‌, నజీబుల్లా జద్రాన్‌లతో బ్యాటింగ్ బాగానే ఉంది. మిడిలార్డర్‌లో రహ్మత్‌ స్థానంలో హిట్టర్ హజ్రతుల్లా జట్టులోకి రానున్నాడు. మరోసారి స్పిన్‌నే బలంగా నమ్ముకుంటోంది. ముజీబ్, నబీలపై భారీ అంచనాలు ఉన్నాయి. పేసర్లు ఫజల్, నవీన్, గుల్బదిన్‌లు భారత్‌ బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ను ఎంత వరకు నిలువరిస్తారనేది చూడాలి.

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌, గిల్/యశస్వి, కోహ్లీ, దూబె, జితేశ్‌, రింకు, అక్షర్‌, సుందర్‌/కుల్దీప్, బిష్ణోయ్‌/అవేశ్‌, అర్ష్‌దీప్‌, ముకేశ్‌.
అఫ్గానిస్థాన్‌: గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, రహ్మత్‌/హజ్రతుల్లా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, నజీబుల్లా జద్రాన్‌, మహమ్మద్‌ నబి, గుల్బాదిన్‌ నయీబ్‌, కరీం జనాత్‌, ఫజల్‌ ఫరూఖీ, నవీనుల్‌ హక్‌, ముజీబ్‌.

Show comments