IND Playing 11 vs SL for Asia Cup Final 2023: ఆసియా కప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన భారత్, శ్రీలంక జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు టైటిల్ పోరు ఆరంభం కానుంది. ఆసియా కప్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 9వ సారి టైటిల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడనుండడం విశేషం. ప్రపంచకప్ 2023 ముందు ఆసియా కప్ గెలవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో భారత్ తుది జట్టు ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.
పాకిస్థాన్‌పై ఫామ్ అందుకున్న ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జట్టుకు మరోసారి మంచి ఆరంభం ఇవ్వాల్సిన అవసరముంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైనల్లో ఆడుతాడు. కోహ్లీ మరో సెంచరీ సెంచరీ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. కీలక నాలుగో స్థానంలో గత కొంతకాలంగా ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్‌కు గాయం కావడంతో అతడి ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు. అయితే ఇషాన్ స్థానాన్ని యువ ఆటగాడు తిలక్ వర్మతో భర్తీ చేసే అవకాశాన్ని భారత్ పరిశీలిస్తోంది. శ్రేయాస్ గాయం కారణంగా ప్రపంచకప్ 2023లో తిలక్‌ను ఆడించాలనుకుంటే.. ఫైనల్లో అతడు ఆడతాడు.
ఐదవ స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. 6, 7 స్థానాల్లో ఆల్‌రౌండర్‌లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు ఆడుతారు. అక్షర్ పటేల్ చేతి వేళ్లకు గాయం కావడంతో.. ఫైనల్‌కు దూరమయ్యాడు. అక్షర్‌కు ప్రత్యామ్నాయంగా టీమ్ మేనేజ్‌మెంట్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకుంది. 8వ స్థానంలో సుందర్ లేదా శార్దూల్ ఠాకూర్ తుది జట్టులో ఉంటారు. బంగ్లాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి తిరిగి రానున్నారు.
భారత్ తుది జట్టు (అంచనా-India Playing XI vs Sri Lanka):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్/తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్/శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్.