NTV Telugu Site icon

IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. మహ్మద్‌ సిరాజ్‌పై వేటు!

Mohammed Siraj

Mohammed Siraj

న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమితో సిరీస్‌లో 1-0తో వెనుకంజలో నిలిచిన టీమిండియా.. పూణే టెస్టులో గెలవాలని చూస్తోంది. గురువారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. బెంగళూరు టెస్ట్ పరాజయం నేపథ్యంలో తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాదీ పేసర్‌, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్‌ సిరాజ్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.

విదేశీ పేస్‌ పిచ్‌లపై రాణించినట్లు స్వదేశీ వికెట్లపై మహ్మద్‌ సిరాజ్‌ సత్తా చాటలేకపోతున్నాడు. భారత గడ్డపై 13 టెస్టులాడిన సిరాజ్‌.. 19 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. విదేశాల్లో 17 టెస్టుల్లోనే 61 వికెట్లు తీశాడు. ఇటీవల భారత పిచ్‌లు కాస్త పేస్‌కు అనుకూలిస్తున్నా.. సిరాజ్‌ మాత్రం రాణించలేకపోతున్నాడు. కివీస్‌తో తొలి టెస్టులో 2 వికెట్లే తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అయితే ఒక్క వికెట్ పడగొట్టలేదు. బంతితో బ్యాటర్లను ఇబ్బంది పెట్టినా.. వికెట్లను మాత్రం తీయలేకపోయాడు. దాంతో జస్ప్రీత్ బుమ్రాపై ఒత్తిడి నెలకొంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Sharvari Wagh: టెన్నిస్ ఆడుతూ.. హీట్ పెంచుతున్న బాలీవుడ్‌ సెన్సేషన్‌!

అనుభవం దృష్ట్యా మహ్మద్‌ సిరాజ్‌కే అవకాశాలు ఇస్తున్నప్పటికీ.. ఫామ్‌ ప్రకారం చూస్తే ఆకాశ్‌ దీప్‌కు ఛాన్స్‌ ఇవ్వాలనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆడిన మూడు టెస్టుల్లో ఆకాశ్‌ 8 వికెట్లు పడగొట్టాడు. సగటు 23.12గా ఉంది. ఈ మూడు మ్యాచ్‌లూ స్వదేశంలో ఆడినవే కావడం విశేషం. పూణేలోనూ ఇద్దరు పేసర్లే బరిలోకి దిగితే.. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా ఆకాశ్‌ను ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. జట్టు యాజమాన్యం కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో. కెప్టెన్ రోహిత్ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో.