Site icon NTV Telugu

IND vs NZ 2nd Test: రిషబ్ పంత్‌ ఆడితే.. కేఎల్ రాహుల్‌ తప్పుకోవాల్సిందే!

Team India Test

Team India Test

ఇటీవల టెస్టుల్లో శ్రీలంక చేతిలో దారుణ ఓటములను ఎదుర్కొని భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన మొదటి టెస్టులో సంచలన ప్రదర్శనతో సొంతగడ్డపై వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాకు షాక్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ దిశగా దూసుకెళ్తున్న భారత జట్టుకు ఈ ఓటమి మింగుడుపడం లేదు. పూణే టెస్టులో గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగనుంది. ఇందుకోసం జట్టులో మార్పులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి.

ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు మంచి ఫామ్‌లో ఉన్నారు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తాచాటారు. మెడ నొప్పితో తొలి టెస్టుకు దూరమైన శుభ్‌మన్‌ గిల్‌.. రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న గిల్‌కు తుది జట్టులో చోటు ఖాయం. అయితే గిల్ స్థానంలో బెంగళూరు టెస్టులో ఆడి అద్భుత సెంటిరీ (150) చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పేలవ ప్రదర్శన చేసిన కేఎల్‌ రాహుల్‌పై వేటు తప్పేలా లేదు.

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌! నితీశ్ రెడ్డికి చోటు

బెంగళూరు టెస్టులో మోకాలి గాయంతో కీపింగ్‌కు దూరంగా ఉన్న రిషబ్‌ పంత్.. బ్యాటింగ్‌ మాత్రం చేశాడు. అయితే మోకాలి నొప్పి మాత్రం అతడిని ఇబ్బంది పెట్టింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స జరిగిన కాలికే.. ఇప్పుడు మళ్లీ బంతి తగిలింది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పంత్‌ను రెండో టెస్టుకు దూరంగా ఉంచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పంత్‌ ఆడకపోతే.. గిల్ జట్టులోకి వచ్చినా రాహుల్ జట్టులో కొనసాగుతాడు. పంత్‌ ఆడితే మాత్రం రాహుల్‌పై వేటు పడొచ్చు. రోహిత్, విరాట్ హాఫ్ సెంచరీలు చేయడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.

Exit mobile version