NTV Telugu Site icon

Imran Khan: నన్ను పదేళ్లపాటు జైల్లో ఉంచాలని పాక్ సైన్యం ప్లాన్ చేస్తోంది..

Imran Khan

Imran Khan

Imran Khan: దేశద్రోహ నేరం కింద వచ్చే పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని ఆ దేశ శక్తివంతమైన పాక్‌ మిలిటరీ ప్లాన్‌ చేస్తోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం పేర్కొన్నారు. అల్‌ ఖదీర్‌ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఈ నెల 9న పారామిలిటరీ రేంజర్లు ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. అయితే పాక్‌ సుప్రీంకోర్టు మూడు రోజుల క్రితం ఆయనకు బెయిల్‌ మంజూరుచేసింది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి లాహోర్‌లో పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం వరుస ట్విట్ల ద్వారా పాక్‌ మిలిటరీపై ఆరోపణలు గుప్పించారు. లండన్‌ ప్రణాళిక ఇప్పుడు పూర్తయింది. తాను జైలులో ఉన్నప్పుడు హింసను సాకుగా చూపి న్యాయమూర్తి పాత్రను పోషించారు. తన భార్య బుష్రా బేగంను జైలులో పెట్టడం ద్వారా అవమానించాలనుకున్నారు. దేశ ద్రోహ చట్టాన్ని ఉపయోగింది వచ్చే పదేళ్ల పాటు తనను జైలులోనే ఉంచాలనుకున్నారంటూ ట్వీట్‌ చేశారు. తనను అరెస్టు చేయడం ద్వారా పీటీఐ కార్యకర్తలనే కాకుండా సాధారణ ప్రజలను కూడా భయబ్రాంతులకు గురిచేయాలనుకున్నారని చెప్పారు. అదేవిధంగా మీడియా పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకోవాలని చూశారని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read Also: Waqf Board Chief: కర్ణాటక ఉపముఖ్యమంత్రి ముస్లిం అయి ఉండాలి.. వక్ఫ్ బోర్డు చీఫ్ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రధానంగా రెండు కేసులు ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆ రెండు కేసుల్లో ఒకటి అల్ ఖదీర్ ట్రస్టు కేసు ఒకటి కాగా.. మరొకటి తోషఖానా కేసు. ఈ రెండు కేసుల్లో కూడా ఇమ్రాన్‌ ఖాన్‌ అక్రమంగా డబ్బు కూడగట్టారనేది ప్రధాన ఆరోపణ. అల్ ఖదీర్‌ ట్రస్టు కేసుకు సంబంధించి సంబంధించి దేశ ఖాజానాకు రూ.5వేల కోట్లు నష్టం వాటిల్లందనే ఆరోపణలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు అల్ ఖదీర్ ట్రస్ట్‌ ఏర్పాటు ముసుగులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వ ఆరోపణల ప్రకారం.. పాకిస్థాన్ పంజాబ్‌లోని జీలం జిల్లాలో సూఫీయిజం బోధించేందుకు అల్ ఖదీర్ యూనివర్సిటీ నిర్మించేందుకు ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ, కొద్ది మంది సన్నిహితులతో అల్ ఖదీర్ ట్రస్టు ఏర్పాటు చేశారు.2019లో ఇమ్రాన్‌ ఖాన్ భార్య బహ్రియా పట్టణానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి విరాళాలు తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ట్రస్ట్‌కు దాదాపు 57 ఎకరాల భూమిని ఆ సంస్థ విరాళంగా ఇచ్చింది. ఆ భూమిలో 30 ఎకరాల భూమిని బుష్రా బీబీ తన ఫ్రెండ్ ఫరా గోగి పేరు మీద బదలాయించింది.

బహ్రియాలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అధిపతే మాలిక్‌ రియాజ్‌. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్ని బ్రిటన్‌లో విచారించే నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ (ఎన్‌సీఏ) ఒకానొక కేసులో మాలిక్‌ రియాజ్‌ నుంచి ఏకంగా 19 కోట్ల పౌండ్ల (అప్పట్లో పాకిస్తాన్‌ కరెన్సీలో రూ. 5,000 కోట్లు) నల్లధనం జప్తు చేసింది. బ్రిటన్‌లో చట్టాల ప్రకారం విదేశీయుడికి చెందిన డబ్బుల్ని స్వాధీనం చేసుకుంటే తిరిగి వారి మాతృ దేశంలో ప్రభుత్వానికి అప్పగించాలి. అదే ప్రకారం పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే ఇమ్రాన్‌కు, మాలిక్‌ రియాజ్‌కు మధ్య కుదిరిన ఒప్పందంతో ఇమ్రాన్‌ సర్కార్‌ ఆ వ్యాపారి బ్రిటన్‌ ఖాతాకు తిరిగి డబ్బులు పంపినట్టుగా పాక్‌ సంకీర్ణ సర్కారు ఆరోపిస్తోంది. దీనికి ప్రతిఫలంగా మాలిక్‌ రియాజ్‌ యూనివర్సిటీ నిర్మాణం కోసం భూములతో పాటు రూ.500 కోట్ల రూపాయల్ని కూడా ముట్టజెప్పారన్నది ఆరోపణ. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌ను ఈ ఒప్పందంతో ఇమ్రాన్‌ సర్కార్‌ పూర్తిగా ముంచేసిందని షహబాజ్‌ సర్కార్‌ ఆరోపించింది. ఈ కేసులో మే 1న ఇమ్రాన్‌పై అరెస్ట్‌కి వారెంట్లు జారీ కాగా మే9న ఆయన అరెస్టయ్యారు.

Read Also: Karnataka: కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ.. డీకేకు బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేనా?

తోషాఖానా కేసు..
ప్రభుత్వానికి వచ్చే కానుకలను భద్రపరిచే ఖజానాను తోషఖానా అంటారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాని పదవిలో ఉండగా 101 కానుకలు వచ్చాయి. వాటిల్లో అత్యంత ఖరీదైన వజ్రాల రిస్ట్‌ వాచీలు, ఉంగరాలు, కఫ్‌లింక్స్‌ పెయిర్, రోలాక్స్‌ వాచీలు, పెన్నులు పెర్‌ఫ్యూమ్స్, ఐ ఫోన్లు, మసీదు, అత్తర్‌ బాటిల్స్‌ నమూనాల వంటి కళాకృతులు వంటివి ఉన్నా యి. ఇమ్రాన్‌ తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించడంతో పాటు వాటిని అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఈసీకి లేఖ కూడా రాశారు. 2018, సెప్టెంబర్‌ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన కానుకల్ని ప్రభుత్వానికి రూ.2 కోట్లు చెల్లించి ఇమ్రాన్‌ తీసుకున్నారని, వాటిని మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. కేవలం మూడు వాచీలను అమ్మేసి ఇమ్రాన్‌ సొమ్ము చేసుకున్న మొత్తం రూ.3.6 కోట్లుగా తేలింది. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ (పీఎంఎల్‌–ఎన్‌) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్‌ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ము కున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్‌ గద్దె దిగిన తర్వాత తోషఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు మిగల్లేదు. ఇప్పుడు పాక్‌ కోర్టు ఆయనని ఈ కేసులో దోషిగా తేల్చింది.