భారత్ లోకి అక్రమంగా చొరబడే వారిపై ఉక్కుపాదం మోపనుంది సర్కార్. భారత్ లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను, ఇమ్మిగ్రేషన్ విషయాలను నియంత్రించడానికి రూపొందించిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం, 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందింది. ఏప్రిల్ 4, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితేష్ కుమార్ వ్యాస్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో, “కేంద్ర ప్రభుత్వం, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం, 2025 (2025 చట్టం 13)లోని సెక్షన్ 1లోని సబ్-సెక్షన్ (2) ద్వారా ఇవ్వబడిన అధికారాలను ఉపయోగించి, సెప్టెంబర్ 1, 2025ని దీని ప్రారంభ తేదీగా ప్రకటిస్తోందని పేర్కొన్నారు.
ఈ చట్టం ప్రకారం, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా వీసాలను ఉపయోగించి భారతదేశంలోకి ప్రవేశించడం, ఉండటం లేదా మోసం చేసి వెళ్లడం.. చేసే వారికి ఇప్పుడు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, గరిష్టంగా రూ. 10 లక్షల జరిమానా విధించవచ్చని అధికారులు తెలిపారు. కనీస శిక్ష 2 సంవత్సరాలు, కనీస జరిమానా రూ. 1 లక్షగా నిర్ణయించారు. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా వీసా వంటి ప్రయాణ పత్రం లేకుండా ఒక విదేశీ పౌరుడు భారతదేశంలోకి ప్రవేశిస్తే, అతనికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 5 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
ఈ చట్టం ఇమ్మిగ్రేషన్ బ్యూరోను మరింత బలోపేతం చేసింది. ఇప్పుడు ఈ ఏజెన్సీ అక్రమ విదేశీ పౌరులను వెంటనే బహిష్కరించే అధికారం ఉంటుంది. రాష్ట్రాలతో నేరుగా సమన్వయం చేసుకుంటుంది. దీనితో పాటు, హోటళ్ళు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు విదేశీ పౌరులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం తప్పనిసరి. ఏదైనా సంస్థలో అక్రమ విదేశీ పౌరులు కనిపిస్తే, దాని రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. అన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు, షిప్పింగ్ కంపెనీలు భారతదేశానికి చేరుకున్న తర్వాత తమ ప్రయాణీకులు, సిబ్బంది పూర్తి మానిఫెస్ట్, ముందస్తు సమాచారాన్ని పౌర అధికారం లేదా ఇమ్మిగ్రేషన్ అధికారికి సమర్పించాలి. ఈ కొత్త చట్టం విదేశీ పౌరులు, ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన అన్ని విషయాలను ఒకే చట్టం కిందకు తెస్తుంది.
Also Read:Chiranjeevi : పవన్ కల్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెస్
గతంలో, నాలుగు వేర్వేరు చట్టాలు అమలులో ఉన్నాయి. వాటిలో పాస్‌పోర్ట్ (భారతదేశంలోకి ప్రవేశం) చట్టం, 1920; విదేశీయుల నమోదు చట్టం, 1939; విదేశీయుల చట్టం, 1946, వలస చట్టం, 2000 ఉన్నాయి. ఇప్పుడు ఈ చట్టాలన్నీ రద్దు చేశారు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం భారతదేశంలో జాతీయ భద్రత, వలస వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని, అలాగే నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా వీసాల ముసుగులో దేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులపై కఠిన చర్యలు తీసుకుంటుందని హోం మంత్రిత్వ శాఖ విశ్వసిస్తోంది.
