IMF bailout for Sri Lanka: చుట్టూ ఉండే సముద్రపు నీటి మాదిరిగా.. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలతో.. సంక్షోభ సంద్రంలో చిక్కుకున్న శ్రీలంకకు.. IMF రూపంలో శ్రీరామరక్ష లభించింది. ఆ.. ద్వీప దేశానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. నాలుగేళ్లపాటు అమలుచేయనున్న ఈ బెయిలౌట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తక్షణం 333 మిలియన్ డాలర్లు విడుదల చేయనుంది.
Marry Now Pay Later: పెళ్లికి డబ్బు కావాలా? Marry Now-Pay Later అంటున్న సంస్థ
తద్వారా.. ఇతర ఆర్థిక సంస్థలు సైతం శ్రీలంకను ధైర్యంతో ఫైనాన్షియల్‌గా ఆదుకునేందుకు ఈ నిర్ణయం పరోక్షంగా దోహదపడనుంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగటంతో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక మరియు సామాజిక సవాళ్లను ఎదుర్కొంటోందని IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్టాలినా జార్జీవా అన్నారు. విదేశీ మారక నిల్వలు అడుగంటాయని, రుణభారం మోయలేని స్థాయికి చేరిందని, ఫలితంగా ఆర్థిక రంగ పరిస్థితి దుర్బలంగా మారిందని తెలిపారు.
అగమ్యగోచరంగా ఉన్న తమ దేశాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మరియు ఇతర అంతర్జాతీయ భాగస్వాములు పెద్ద మనసుతో ఆదుకోవటం పట్ల శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున సంస్కరణలు అమలుచేసి దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కిస్తామని పేర్కొన్నారు. శ్రీలంకకు సాయం చేసే దేశాల జాబితాలోకి ఈ నెల మొదటి వారంలో చైనా కూడా చేరటంతో ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన చివరి ఆటంకం తొలిగిపోయినట్లయింది.
ఆర్థిక సంస్కరణల్లో భాగంగా శ్రీలంక ఇప్పటికే కొన్ని చర్యల అమలుకు శ్రీకారం చుట్టింది. ఆదాయపు పన్నులను పెంచటంతోపాటు విద్యుత్ మరియు ఇంధన సబ్సిడీలను ఎత్తేసింది. కరోనా వల్ల టూరిజం దెబ్బతినటం, ఎగుమతులు నిలిచిపోవటంతో శ్రీలంక గతేడాది విదేశీ రుణాలను చెల్లించలేక చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.
దీంతో.. దేశంలో తిండి గింజలు, మందులు, వంట గ్యాస్, చమురు తదితర నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రజలు రోడ్ల మీదికెక్కటంతో చేసేదేమీలేక అప్పటి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్ష దేశం విడిచి పారిపోయారు.