SL Vs PAK: 64 బంతుల్లో విధ్వంసం.. ఎవరూ ఊహించని రేంజ్ క్లైమాక్స్..

Sl Vs Pak

Sl Vs Pak

పాకిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంక మహిళా క్రికెటర్ ఇమేషా దులాని అద్భుతమైన శతకంతో సంచలనం సృష్టించింది. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె శ్రీలంక జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక తరఫున సెంచరీ చేసిన రెండో మహిళా బ్యాటర్‌గా దులాని నిలిచింది. అంతకుముందు 2019లో ఆస్ట్రేలియాపై చామరి అటపట్టు శ్రీలంక తరఫున తొలి సెంచరీ సాధించగా, దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత దులాని (64 బంతుల్లో 101 నాటౌట్) ఈ ఘనత సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో షవాల్ జుల్ఫికర్ 61 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ మునీబా అలీ 42 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో కవిషా దిల్హారి రెండు వికెట్లు తీయగా, కావ్య కవింది, సుగంధిక కుమారి, చాముడి ప్రబోధ తలొక వికెట్ పడగొట్టారు.

అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు ఇమేషా దులాని, కెప్టెన్ చామరి అటపట్టు మొదటి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యంతో మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. నాశ్రా సంధూ బౌలింగ్‌లో అటపట్టు (39) అవుట్ అయిన తర్వాత, విశిమి గుణరత్నె (3), హర్షిత సమరవిక్రమ (7), కవిషా దిల్హారి (11) త్వరత్వరగానే నిష్క్రమించారు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా దులాని మాత్రం క్రీజులో నిలకడగా ఆడుతూ పాకిస్థాన్ బౌలర్లను ఎదుర్కొంది. ఆమె తన ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 101 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. 19వ ఓవర్ చివరి బంతికి శ్రీలంక విజయాన్ని ఖాయం చేసుకుంది. పాకిస్థాన్ బౌలర్లలో నాశ్రా సంధూ రెండు వికెట్లు పడగొట్టింది.