Woman SI Attacked: శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలో అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకునేందుకు వెళ్లిన మహిళా ఎస్సైపై దాడి జరిగింది. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలించి విక్రయిస్తున్న వారిని పట్టుకునే క్రమంలో ఎస్సై శోభారాణిపై దాడికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అగళి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, డాబాలు తదితర ప్రాంతాలకు కర్ణాటక మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా మల్లికార్జున మరియు అతని కూతురు కీర్తనను పట్టుకున్నారు.
అయితే, తమపై కేసు నమోదు చేయకుండా తప్పించుకునే ప్రయత్నంలో తండ్రి–కూతురు పోలీసులపై రెచ్చిపోయారు. ఈ క్రమంలో కీర్తన ఎస్సై శోభారాణిని చెంపపై కొట్టినట్లు పోలీసులు తెలిపారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిపై చేయి చేసుకోవడం తీవ్ర నేరమని హెచ్చరించినా వారు వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే దాడికి పాల్పడ్డ మల్లికార్జున, కీర్తనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విధులకు ఆటంకం కలిగించడం, పోలీసు అధికారిపై దాడి చేయడం వంటి అభియోగాల కింద కీర్తనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులపై దాడులు చేస్తే చట్టప్రకారం కఠిన శిక్ష తప్పదని జిల్లా పోలీసు అధికారులు హెచ్చరించారు.
