Site icon NTV Telugu

Ilaiyaraaja: ఇళయరాజా ఖాతాలో.. మరో ప్రతిష్టాత్మక అవార్డు!

భారతీయ సంగీత ప్రపంచంలోనే.. తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను, మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. మహారాష్ట్రలో జరగనున్న, అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF) నిర్వాహకులు, ఈ ఏడాది ‘పద్మపాణి’ పురస్కారాన్ని ఇళయరాజాకు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దశాబ్దాలుగా వేల సంఖ్యలో అద్భుతమైన పాటలను అందించి, కోట్లాది మంది సంగీత ప్రియులకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఛత్రపతి శంభాజీ నగర్‌లో జరగనున్న ఈ చలనచిత్రోత్సవ ప్రారంభ వేడుకల్లో భాగంగా, దేశ విదేశాలకు చెందిన సినీ ప్రముఖుల సమక్షంలో ఇళయరాజా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కాగా ఈ గౌరవం ఆయన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో మరొక కలికితురాయిగా నిలవనుంది.

Also Read : Dimple Hayathi: డేవిడ్‌తో పెళ్లి వార్తలపై స్పందించిన డింపుల్.. అసలేమైందంటే?

పద్మపాణి పురస్కారం‌లో భాగంగా ఇళయరాజాకు ఒక జ్ఞాపికతో పాటు గౌరవ పత్రం.. అలాగే రూ. 2 లక్షల నగదు బహుమతి‌ని ప్రదానం చేయనున్నారు. గతంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని భారతీయ చిత్రపరిశ్రమ‌కు చెందిన ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్, విలక్షణ నటుడు ఓం పురి, ప్రఖ్యాత దర్శక-రచయిత్రి సాయి పరంజ్‌పే వంటి దిగ్గజాలు అందుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఇళయరాజా పేరు చేరడం పట్ల ఆయన అభిమానులు, సంగీత కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాటలకే కాకుండా, నేపథ్య సంగీతం‌లో వినూత్న ప్రయోగాలు చేస్తూ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి‌కి, ఈ పురస్కారం దక్కడం సముచితమని ఇండస్ట్రీ వర్గాలు కొనియాడుతున్నాయి. ఇక ఈ వేడుక కోసం అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version