NTV Telugu Site icon

IPL 2025: 500 పరుగులు చేస్తే చాలు.. యువ క్రికెటర్లకు సురేశ్ రైనా కీలక సూచన!

Suresh Raina

Suresh Raina

జాతీయ జట్టులోకి రావాలనుకొనే భారత యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చక్కటి అవకాశం. ఐపీఎల్‌లో సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన జాబితా చాలానే ఉంది. సీనియర్లతో పాటు యువ క్రికెటర్లలో కూడా చాలా మంది ఐపీఎల్ ద్వారానే టీమిండియాలోకి వచ్చారు. యువ క్రికెటర్లలో శుభ్‌మన్‌ గిల్‌, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌లు ఐపీఎల్ ద్వారానే జట్టులోకి వచ్చారు. కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ ఎంతో మందికి జాతీయ జట్టులో అవకాశాలు కల్పించింది. ఐపీఎల్ ద్వారా కుర్రాళ్లకు జాతీయ జట్టులో అవకాశం రావడంపై భారత మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్‌ రైనా స్పందించాడు.

కుర్రాళ్లు ఐపీఎల్‌లో రాణిస్తే జాతీయ జట్టులో చోటు ఖాయమని సురేశ్‌ రైనా పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం చాలా మంది యువ క్రికెటర్లు అద్భుతమైన టాలెంట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నారు. టీమిండియా టీ20 ప్రపంచ కప్‌ 2024ను గెలిచింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 విజేతగా కూడా నిలిచింది. యువ క్రికెటర్లు కెప్టెన్లుగా ఎదుగుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీతో పాటు కొందరు ఫాస్ట్‌ బౌలర్లను చూస్తుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు కొత్తతరం క్రికెటర్లను మనం చూస్తున్నాం. తిలక్ వర్మ , యశస్వి జైస్వాల్, రింకు సింగ్.. మంచి టాలెంట్‌ ఉన్న ఆటగాళ్లు వస్తున్నారు. అక్షర్ పటేల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇది భారత జట్టుకు మంచిది’ అని రైనా అన్నాడు.

‘యువ క్రికెటర్లకు ఓ సూచన. వర్తమానంలో ఉండి ఆటపై దృష్టి పెడితే అవకాశాలు అవే వస్తాయి. నిలకడగా ఆడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది. ఒక ఐపీఎల్ సీజన్‌లో 500కు పైగా పరుగులు చేస్తే తప్పకుండా జాతీయ జట్టులో చోటు దక్కుతుంది. ప్రతి ఐపీఎల్‌ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవాలి. నిర్భయంగా ఆడుతూ.. టెక్నిక్‌తో పాటు యాటిట్యూడ్‌ను మెరుగుపర్చుకోవాలి. ఐపీఎల్‌ లాంటి పెద్ద టోర్నీలో సత్తా చాటితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. భారత ఆటగాళ్లకు ఐపీఎల్ మంచి అవకాశం. ప్రతి ఒక్క యువ క్రికెటర్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి’ అని సురేశ్‌ రైనా సూచించాడు.