Site icon NTV Telugu

ICICI Minimum Balance: ఐసిఐసిఐ బ్యాంక్ యూ-టర్న్.. కనీస బ్యాలెన్స్ పరిమితి తగ్గింపు.. ఖాతాలో ఇంత డబ్బు ఉంటే చాలు

Icici Bank

Icici Bank

ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు శుభవార్త అందించింది. కొత్త కస్టమర్ల కోసం ఇటీవల పెంచిన కనీస బ్యాలెన్స్ పరిమితిని తగ్గించింది. పొదుపు ఖాతా కనీస బ్యాలెన్స్ (MAB) నియమాలను మళ్ళీ మార్చామని, కస్టమర్లకు ఉపశమనం కలిగిస్తూ, ఈ పరిమితిని మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రూ. 50,000 నుంచి రూ. 15,000 కు తగ్గించామని వెల్లడించింది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో పొదుపు ఖాతాలలో కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్ (MAB) పరిమితిని మార్చినప్పటికీ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో దీనిని రూ.25,000 నుంచి రూ.7,500కి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000 నుంచి రూ.2,500కి తగ్గించారు. అయితే, ఖాతాదారులు తమ ఖాతాలో నిర్దేశించిన పరిమితి కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంచుకుంటే, వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ స్పష్టం చేసింది.

Also Read:OnePlus Nord 5 vs Vivo V60: ప్రాసెసర్, డిస్ప్లే, డిజైన్ లో ప్రీమియం ఏది? ఎందుకు?

ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్ తన నియమాలను మారుస్తూ, పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ పరిమితిని పెంచి, మునుపటితో పోలిస్తే 5 రెట్లు పెంచిన విషయం తెలిసిందే. ఈ మార్పు తర్వాత, ఖాతాలో రూ.10,000కి బదులుగా కనీసం రూ.50,000 ఉంచడం తప్పనిసరిగా మారింది. దీనిపై కస్టమర్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కస్టమర్ల అభిప్రాయాల ఆధారంగా, కనీస బ్యాలెన్స్ పరిమితిని తగ్గించాలని నిర్ణయించినట్లు ఐసీఐసీఐ వెల్లడించింది. పెరిగిన పరిమితి ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చిందని, తగ్గించిన పరిమితి కూడా అదే తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనితో పాటు, కొత్త పరిమితి శాలరీ అకౌంట్స్, సీనియర్ సిటిజన్లు, పెన్షనర్ల ఖాతాలకు వర్తించదని, జూలై 31 కి ముందు తెరిచిన బ్యాంకు ఖాతాలకు కొత్త నియమం వర్తించదని ICICI బ్యాంక్ తెలిపింది.

Also Read:Ravichandran Ashwin: డెవాన్‌ కాన్వే నన్ను మోసం చేయాలనుకున్నాడు.. ఆసక్తికర విషయం చెప్పిన అశ్విన్!

పెరిగిన MAB పరిమితిని తగ్గించాలనే ICICI బ్యాంక్ నిర్ణయం ఉపశమనం కలిగించేదే, కానీ కొత్త పరిమితితో కూడా, పాత జరిమానా నియమం వర్తిస్తుంది. అంటే, ఖాతాదారుడు ఖాతాలో అవసరమైన కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించడంలో విఫలమైతే, కనీస బ్యాలెన్స్‌లో 6 శాతం లేదా రూ. 500, ఏది తక్కువైతే అది వసూలు చేస్తారు. అయితే, కుటుంబ బ్యాంకింగ్ ఖాతాదారులు, పెన్షనర్ల ఖాతాలకు ఈ రుసుము నుంచి మినహాయింపు ఉంది.

Exit mobile version