Womens T20 World Cup 2024 Held in UAE: అందరూ ఊహించిందే జరిగింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 బంగ్లాదేశ్ నుంచి తరలిపోయింది. ప్రస్తుతం బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వచ్చే అక్టోబర్‌లో అక్కడ జరగాల్సిన టీ20 ప్రపంచకప్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి తరలివెళ్లింది. బంగ్లాదేశ్‌లో పర్యటించడానికి పలు క్రికెట్ దేశాలు నిరాకరిస్తున్న నేపథ్యంలో టోర్నీ వేదికను తరలించక ఐసీసీకి తప్పలేదు. వేదిక మార్పునకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కూడా అంగీకరించింది.
‘బంగ్లాదేశ్‌లో మహిళల టీ20 ప్రపంచకప్ జరగకపోవడం నిరాశ కలిగించే విషయం. మెగా టోర్నీని బీసీబీ గొప్పగా నిర్వహించేది. ప్రస్తుతం బంగ్లాలో పర్యటించడానికి చాలా దేశాలు సుముఖంగా లేని నేపథ్యంలో అక్కడ టోర్నీని నిర్వహించడం సాధ్యం కాదు. అయితే బంగ్లాకు ఆతిథ్య హక్కులు కొనసాగుతాయి. భవిష్యత్తులో ఏదైనా ఐసీసీ టోర్నీని బంగ్లాలో నిర్వహించడానికి ప్రయత్నిస్తాం. మెగా టోర్నీని నిర్వహించడానికి ముందుకు వచ్చిన యూఏఈ బోర్డును అభినందిస్తున్నాం’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్డిస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మహిళల టీ20 ప్రపంచకప్ అక్టోబరు 3 నుంచి 20 వరకు షెడ్యూల్ అయి ఉంది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల విషయమై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్రతరం కావడంతో.. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచివెళ్లారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయినా.. అల్లర్లు ఆగలేదు. దాంతో మంగళవారం వర్చువల్‌గా సమావేశమైన ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్, షార్జాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది.
