NTV Telugu Site icon

ICC Cricket World Cup 2023: నేటి నుంచే వన్డే ప్రపంచకప్‌.. తొలి పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ ఢీ!

England Vs New Zealand

England Vs New Zealand

CWC23 ENG vs NZ Preview and Playing 11: ఐసీసీ ప్రపంచకప్‌ 2023కి సమయం ఆసన్నమైంది. భారత్‌ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్, రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో మొదలు కాబోతోంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ టీమ్స్ ప్రపంచకప్‌ ఫేవరెట్ల జాబితాలో ఉన్నాయి. దూకుడుకు మారుపేరైన ఇంగ్లీష్ జట్టు మరోసారి హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై భారీ అంచనాలతో దిగుతున్న భారత్‌కు ప్రధాన ముప్పుగా ఇంగ్లండ్‌ను భావిస్తున్నారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ కూడా గట్టి పోటీదారులే.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నా.. న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేయలేం. ప్రపంచకప్‌ 2023 ముంగిట ఈ రెండు జట్ల మధ్య జరిగిన సిరీస్‌ను ఇంగ్లీష్ జట్టు 3-1తో గెలిచినా.. మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. దాంతో మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. టామ్ లాతమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్‌, గ్లెన్ ఫిలిప్స్‌, డారిల్ మిచెల్‌, ట్రెంట్ బౌల్ట్‌, టీమ్ సౌథీ, రచిన్‌ రవీంద్ర, లాకీ ఫెర్గూసన్, ఇష్‌ సోధి లాంటి ఉత్తమ ఆటగాళ్లతో కివీస్‌ బలంగా ఉంది. అయితే కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ దూరమవడం కాస్త నిరాశపరిచే అంశం.

మరోవైపు ఇంగ్లాండ్‌ జట్టులో ఎక్కువ మంది విధ్వంసక బ్యాటర్లే ఉన్నారు. జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్‌, జో రూట్‌, హరీ బ్రూక్‌, లియామ్ లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, జొస్ బట్లర్‌లతో కూడిన బ్యాటింగ్‌ లైనప్‌ను చూసి ఏ జట్టయినా భయపడాల్సిందే. ఇందులో ఏ ఇద్దరు చెలరేగినా భారీ స్కోర్ తప్పదు. ఇక డేవిడ్ విల్లీ, సామ్‌ కరన్‌, రీస్ టాప్లీ, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్‌, క్రిస్ వోక్స్‌లతో బౌలింగ్‌ కూడా బలంగా ఉంది. ఇంగ్లీష్ జోరును ఆపాలంటే కివీస్ కష్టపడక తప్పదు.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలివే!

తుది జట్లు (అంచనా):
ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్/హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
న్యూజిలాండ్‌: డెవాన్ కాన్వే, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్/రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్.