ICC vs Bangladesh: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు సమాచారం. టోర్నమెంట్ భారత్‌లోనే జరుగుతుందని స్పష్టంగా చెప్పడంతో, బీసీబీ ఆ నిర్ణయాన్ని నిరాకరించడంలో రాజకీయ దురుద్దేశం దాగి ఉందని ఐసీసీ అనుమానిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే అంతర్గతంగా విచారణ ప్రారంభించినట్లు క్రీడా వర్గాలు తెలియజేస్తున్నాయి. బంగ్లాదేశ్ నిర్ణయం వెనుక క్రికెట్‌కు అతీతమైన కారణాలు ఉన్నాయని నిర్ధారణ అయితే, బీసీబీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
అయితే, అవసరమైతే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును సస్పెండ్ చేయాలన్న ఆలోచన కూడా ఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వచ్చే నెల 7న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ అంశంపై ఆలస్యం చేయకుండా త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. వరల్డ్ కప్ టోర్నమెంట్ షెడ్యూల్, నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ఐసీసీ చర్యలు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీస్తుండగా, బంగ్లాదేశ్ టోర్నీ బహిష్కరణపై ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
