అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రతిష్టాత్మక 2027 వన్డే ప్రపంచకప్ అర్హత పోటీల ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 2027 ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీని ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అయితే ఈ టోర్నీ వేదికను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2027 ప్రపంచకప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు 12 వేదికల్లో జరగనుంది.
నయా ఫార్మాట్ ప్రకారం.. 10 జట్లు పాల్గొనే ఈ క్వాలిఫైయర్‌లో విజేతగా నిలిచిన జట్టు 14 జట్ల ప్రధాన ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్స్ సిరీస్ (మొదటి రౌండ్)లో పోటీపడతాయి. అందులో అగ్రస్థానంలో నిలిచే జట్టు 12 జట్ల ప్రధాన దశకు చేరుకుంటుంది.
ఈ 10 జట్ల క్వాలిఫైయర్‌లో స్థానాల కేటాయింపు కూడా ఆసక్తికరంగా ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సెప్టెంబర్ 30, 2026 నాటికి అతి తక్కువ ర్యాంక్ ఉన్న ఇద్దరు ఫుల్ మెంబర్లు (ఆతిథ్య దక్షిణాఫ్రికా, జింబాబ్వే కాకుండా) ఈ రేసులో ఉంటారు. వారితో పాటు సిడబ్ల్యూసి లీగ్-2 నుండి టాప్-4 జట్లు, క్వాలిఫైయర్ ప్లేఆఫ్స్ నుండి టాప్-4 జట్లు ఇందులో పోటీపడతాయి. ప్లేఆఫ్స్ కోసం లీగ్-2 లోని దిగువ 4 జట్లు, ఛాలెంజ్ లీగ్ లోని 4 జట్లు తలపడతాయి. ఛాలెంజ్ లీగ్‌లో 12 జట్లను రెండు పూల్‌లుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. 10వ ర్యాంక్‌లో ఉన్న విండీస్ సెప్టెంబర్ కట్ ఆఫ్ లోపు భారత్‌తో కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడనుంది. మరోవైపు అఫ్గానిస్థాన్ (8వ ర్యాంక్), ఐర్లాండ్ (12వ ర్యాంక్) సిరీస్ ఫలితాలు కూడా విండీస్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ఐర్లాండ్ 4-1 లేదా 5-0తో అఫ్గానిస్థాన్‌పై గెలిస్తే, భారత్‌పై రెండు విజయాలు విండీస్‌ను టాప్-8లోకి తీసుకెళ్తాయి. ఒకవేళ అఫ్గానిస్థాన్ గెలిస్తే, విండీస్ మళ్లీ క్వాలిఫైయర్స్ ఆడక తప్పదు. 2023లో నెదర్లాండ్స్ చేతిలో ఓడి ప్రపంచకప్‌కు దూరమైన వెస్టిండీస్‌కు ఈసారి అర్హత సాధించడం సవాలుగా మారింది.

