IBM: H-1B వీసాదారులకు IBM షాక్.. అమెరికా వదిలి వెళ్లండి లేదా ఉద్యోగం మానేయండి!

  • హెచ్‌ 1బీ వీసా స్పాన్సర్‌షిప్ నిలిపివేస్తున్న ఐబీఎం..
  • డిసెంబర్ 31లోగా ఉద్యోగం మానేయడం, వేరే దేశానికి వెళ్లడమే ఆప్షన్..
Ibm

Ibm

IBM: ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగుల లే ఆఫ్స్ కొనసాగుతున్న సమయంలో, ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్ంగా 1.50 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్న తన కన్సల్టింగ్ విభాగంలో మెజారిటీ ఉద్యోగులకు అమెరికా వర్క్ వీసాు, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఉద్యోగులు ఉద్యోగం మానేయడం లేదా 2026 డిసెంబర్ 31 నాటికి మరో దేశానికి బదిలీ కావాలని సూచించింది. ఐబీఎం నిర్ణయంతో అమెరికా టెక్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఉద్యోగుల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది.

వేరే దేశానికి ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లలేని వారికి డిసెంబర్ 31, 2026 చివరి పనిదినంగా పరిగణించి, వీరికి మూడు నెలల సీవరెన్స్ (వేతన పరిహారం) అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణయం ద్వారా ఎంత మంది ప్రభావితమవుతున్నారనే దానిపై ఐబీఎం ఇంకా స్పష్టతనివ్వలేదు.

హెచ్‌ 1బీ వీసా స్పాన్సర్‌షిప్ ఎందుకు నిలిపివేస్తోంది.?

ఐబీఎం తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది భారతీయ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. మారుతున్న వ్యాపార అవసరాలకు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అమెరికాలోనే లభిస్తుండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐబీఎం ప్రతినిధి వెల్లడించారు. గత కొన్నేళ్లుగా అమెరికా హై-స్కిల్డ్ వీసా ప్రోగ్రామ్‌లో తన భాగస్వామ్యం తగ్గుతూ వస్తోందని, తమ క్లయింట్ అవసరాలకు అనుగుణంగా కన్సల్టింగ్ విభాగంలో చాలా పోస్టులకు వీసా, గ్రీన్ కార్డు స్పాన్సర్ షిప్ ఆపేస్తున్నట్లు స్పష్టం చేశారు. రెడ్ హ్యాట్, హాటికార్ప్,కాన్‌ఫ్లుయెంట్ వంటి కొనుగోళ్లతో సాఫ్ట్‌వేర్ ఆధారిత సంస్థగా మారుతున్న వేళ, కన్సల్టింగ్ విభాగం 2024 నుంచి వృద్ధి పరంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది.

గమ్యస్థానంగా భారత్..?

ఐబీఎంలో కొనసాగాలనుకునే ఉద్యోగులకు భారత్ గమ్యస్థానంగా మారే అవకాశం ఉంది. నవంబర్ 19 నాటికి అమెరికా బయట ఐబీఎం కెరీర్ పోర్టల్‌లో 1278 కన్సల్టింగ్ ఖాళీలు ఉండగా, ఇందులో 1125ఉద్యోగాలు భారత్‌లోనే ఉన్నాయి. సింగపూర్‌లో 23, యూకేలో 18 ఖాళీలు ఉన్నాయి.

భారతీయ టెక్కీలపై ప్రభావమెంత.?

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో హెచ్హెచ్-1బీ (H-1B) వీసాలపై కఠిన నిబంధనలు, కొత్త హెచ్-1బీ పిటిషన్లపై 1,00,000 డాలర్ల రుసుము ప్రతిపాదన, ఇదే సమయంలో ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల కోసం ఉపయోగించే పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) కార్యక్రమంపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ సమయంలోనే ఐబీఎం ఈ నిర్ణయం తీసుకుంది.

హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికా కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల కోసం విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. ఈ కార్యక్రమం ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నవారిలో భారతీయ ఐటీ నిపుణులు కూడా ఉన్నారు.

ఉద్యోగులు ఒకే సంస్థ, ఒకే దేశంపై ఆధారపడకుండా ఇతర సంస్థల్లోనూ ఉఫయోగపడే నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), ఆటోమేషన్ పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు.