IAS Officer imtiaz Joins YCP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఐఏఎస్ సీనియర్ అధికారి అయిన ఇంతియాజ్ వచ్చే ఎన్నికల్లో కర్నూలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇంతియాజ్ ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ‘సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశయాలతో కర్నూలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. వ్యక్తిగత సమస్యలు ఏమున్నా అందరినీ కలుపుకొని వెళ్తాను. అసమానతలు లేని సమాజం నిర్మించాలని అడుగులు వేస్తున్నా. వైసీపీ అమలు చేస్తున్న నవ రత్నాలు ప్రజలకు మేలు చేశాయి. కర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం’ అని ఇంతియాజ్ అన్నారు.
Also Read: Medaram Jatara: తిరుగువారం పండుగతో ముగిసిన మేడారం జాతర
కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ‘ఇంతియాజ్ గారితో కలిసి పని చేస్తా. ఆయనను కర్నూలులో గెలిపిస్తాం. కొండా రెడ్డి బురుజుపై వైసీపీ జెండా ఎగరెస్తాము. మాకు రాజకీయంగా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. మా రాజకీయ భవిష్యత్ కంటే పార్టీ ముఖ్యం. పార్టీ బాగుంటే మేమంతా బాగుంటాము’ అని అన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ… ‘సీఎం నిర్ణయంతో మేమంతా ఇంతియాజ్ ను గెలిపిస్తాం. మైనార్టీలకు జగన్ అండగా ఉన్నారు. మెజార్టీ స్థానాల్లో మైనారిటీలకు సీఎం అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరూ బాగుండాలని అనేది జగన్ రెడ్డి ఆలోచన. 14 యేళ్లుగా పార్టీలో ఉన్న నాకు అవకాశం లేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జగన్ నిర్ణయం మేరకు నా అడుగులు ఉంటాయి. జగన్ సీఎం అవ్వడం నాకు ముఖ్యం. నేను ఎక్కడ పోటీ చేయడం లేదు. నా గౌరవం, నా స్థానం ఎక్కడ తగ్గకుండా చూస్తానని సీఎం హామీ ఇచ్చారు’ అని పేర్కొన్నారు.