Site icon NTV Telugu

Rajasthan: పొలంలో కుప్పకూలిన జాగ్వార్ ఫైటర్ జెట్.. 5 నెలల్లో కూలిన మూడో విమానం..

Jet

Jet

రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్ప కూలింది. ఈ ఘటనలో భారత వైమానిక దళం (IAF) కు చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. గత ఐదు నెలల్లో జాగ్వార్ విమానాలు కూలిపోవడం ఇది మూడో సారి అని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానం ఓ పొలంలో కూలింది. పైలట్ల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. ఈ ప్రమాద ఘటనను భారత వైమానిక దళం ధ్రువీకరించింది. “ఒక సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజస్థాన్‌లోని చురు సమీపంలో ఒక ఐఏఎఫ్ జాగ్వార్ శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. పౌర ఆస్తికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి విచారణ కోర్టును ఏర్పాటు చేస్తున్నాం. పైటర్ల మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తాం” అని ప్రకటన పేర్కొంది.

READ MORE: Kinjarapu Atchannaidu: జగన్ సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారు?.. అచ్చెన్నాయుడు ఫైర్!

భానుడా గ్రామంలోని వ్యవసాయ పొలంలో మధ్యాహ్నం 1:25 గంటల ప్రాంతంలో విమానం కూలిపోయిందని స్థానిక పోలీసు అధికారి రాజల్దేశర్ కమ్లేష్ మీడియాకు తెలిపారు. ప్రమాద స్థలం సమీపంలో శరీర భాగాలు చెల్లాచెదురుగా కనిపించాయని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యాపించాయి.. ఆకాశం నుంచి పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తర్వాత పొలాల నుంచి మంటలు, పొగలు ఎగసి పడ్డాయని గ్రామస్థులు తెలిపారు. మంటలు ఆర్పేందుకు యత్నించినట్లు గ్రామస్థులు చెప్పారు. సమాచారం అందిన వెంటనే.. జిల్లా కలెక్టర్ అభిషేక్ సురానా, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడానికి, దర్యాప్తులో సహాయం చేయడానికి ఆర్మీ రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.

Exit mobile version