NTV Telugu Site icon

Vinesh Phogat-Gold Medal: గోల్డ్ మెడల్ తీసుకువస్తా.. మాటిచ్చిన వినేశ్‌ ఫొగాట్‌!

Vinesh Phogat Gold Medal

Vinesh Phogat Gold Medal

Vinesh Phogat promises to bring Gold Medal For India: ఒలింపిక్స్‌ చరిత్రలో ఫైనల్‌ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో మంగళవారం జరిగిన సెమీస్‌లో 5-0 తేడాతో క్యూబా రెజ్లర్ గుజ్మన్‌ లోపేజ్‌ను వినేశ్‌ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన వినేష్.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ గెలుపుతో వినేష్ కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.

మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో టోక్యో కాంస్య విజేత, అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్‌తో వినేశ్‌ ఫొగాట్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 11.23 గంటలకు జరగనుంది. స్వర్ణ పతకమే లక్ష్యంగా వినేశ్‌ బరిలోకి దిగుతోంది. గోల్డ్ మెడల్ తీసుకువస్తా అని వినేశ్‌ తన తల్లికి మాట ఇచ్చింది. సెమీస్‌ విజయం తర్వాత వినేష్ వీడియో కాల్‌లో తన తల్లితో మాట్లాడారు. ఈ సమయంలో వినేష్ తన కుటుంబ సభ్యులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. భావోద్వేగానికి గురైంది. వీడియో చివర్లో ‘గోల్డ్ లానా హై’ (నేను బంగారం తెస్తా) అని తన తల్లితో అన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: IND vs GER: సెమీఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓటమి.. కాంస్యం కోసం భారత్‌ పోరు!

పలు కారణాలతో దాదాపు ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన వినేశ్‌ ఫొగాట్‌.. పెద్దగా అంచనాల్లేకుండా పారిస్ ఒలింపిక్స్‌ బరిలో దిగింది. వరల్డ్ నెంబర్ వన్ యుయ్ సుసాకీ (జపాన్) వినేశ్‌ తొలి మ్యాచ్‌ కావడంతో వినేశ్‌ గెలుస్తుందా అని అందరూ అనుకున్నారు. చివరి 9 సెకన్లే ఉందనగా రింగ్‌ బయటకు ప్రత్యర్థిని తోసేసి 3-2తో అనూహ్య విజయం సాధించింది. క్వార్టర్స్‌లో 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య విజేత లివాచ్‌ను 7-5తో వినేశ్‌ ఓడించింది. అదే జోరులో సెమీస్‌లో 5-0 తేడాతో గుజ్మన్‌ లోపేజ్‌ను మట్టికరిపించింది. ఇక పసిడి పోరుకు సిద్దమైంది.