NTV Telugu Site icon

I.N.D.I.A : ఇండియా కూటమికి నాయకుడు అతడే.. తెరపైకి మరో ప్రధాని అభ్యర్థి పేరు

India

India

I.N.D.I.A Alliance PM Candidate: ఈసారి ఎలాగైనా భారతీయ జనతాపార్టీని అధికారంలోకి రానివ్వకూడదని ప్రతిపక్షాలు గట్టిగా నిర్ణయించుకున్నాయి. దాని కోసమే బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చొరవతో ప్రతిపక్ష కూటమి ఇండియాను ఏర్పాటు చేశారు. ఇందులో 26 పార్టీలు ఉన్నాయి. అయితే ఇండియా కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ను ఓడించాలంటే ఐకమత్యం చాలా అవసరం. అయితే ఈ పార్టీ నేతలు చాలా రోజులు ఘర్షణ పడకుండా ఉండగలరో లేదో అర్థం కావడం లేదు. కూటమికి సంబంధించి ఇంతవరకు లీడర్ గా ఎవరిని ప్రకటించలేదు. అయితే ఇందులో ఉన్న ప్రతి పార్టీ నేతలు తమ నాయకుడుకే కూటమికి లీడర్  అయ్యే అర్హతలు ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థి తమ లీడర్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Also Read: Kuwait: షాపింగ్ మాల్ లో గొడవ.. ఎంత పెద్ద శిక్ష విధించారో తెలిస్తే షాక్ అవుతారు

తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ కు ఈ కూటమికి లీడర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతారని తెలిపిన ఆమె .. ఆయన అమలు చేస్తున్న విధానాల వల్ల ఢిల్లీలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను వారి కోసమే అరవింద్ కేజ్రీవాల్ ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆయనే కూటమికి సరైన నాయకుడని ప్రియాంక అభిప్రాయపడ్డారు. అయితే ఇండియా కూటమి నేతను నిర్ణయించేది తాను కాదన్నారు ఆ మహిళా నేత. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను సిలిండర్‌కు రూ.200 చొప్పున తగ్గించడం గురించి స్పందించిన ప్రియాంక  ఇండియా కూటమి పాట్నా, బెంగళూరు సమావేశాల తర్వాత ఈ ధరలు తగ్గాయని, మూడో సమావేశం తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయన్నారు. ఇక కూటమి మూడో సమావేశం రేపు, ఎల్లుండి ముంబైలో జరగనున్న సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా, ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ సరైనవారని రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బాఘెల్ ప్రకటించారు. టీఎంసీ నేతలు మాట్లాడుతూ, ఆ పదవికి తగినవారు మమత బెనర్జీ అంటున్నారు. అయితే మమత మాత్రం తమకు పదవులపై ఆశ లేదని, మోడీని గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక  నితీశ్ కుమార్‌కు అటువంటి ఆలోచన లేదని జేడీయూ నేతలు చెప్తున్నారు. చూడాలి మరి ఇండియా కూటమికి నాయకుడు ఎవరవుతారో.