NTV Telugu Site icon

Phone Tapping Case: తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.. సిట్ విచారణలో ప్రభాకర్‌రావు సమాధానాలు!

Prabhakar Rao Sit

Prabhakar Rao Sit

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు విచారణ ముగిసింది. ప్రభాకర్‌ రావును 9 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. జూన్ 14న మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు. నేడు సుదీర్ఘంగా ప్రభాకర్‌ రావుని సిట్ ప్రశ్నించింది. చాలా ప్రశ్నలకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ సమాధానాలను దాటవేశారు. కొన్ని ప్రశ్నలకు అధికారికం, వ్యక్తిగతం అంటూ సమాధానాలు ఇచ్చారు. ఇంకొన్ని వాటికి అయితే తెలీదు, గుర్తులేదు అంటూ ప్రభాకర్‌ రావు సమాధానం ఇచ్చారు. కొంత సమాచారాన్ని ద్రువీకరించలేను అంటూ సిట్ అధికారులతో చెప్పారు.

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో జూన్ 14న ప్రభాకర్‌ రావు, ప్రణీత్‌ రావులను కలిపి సిట్ విచారించనునట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ప్రభాకర్‌ రావు నుంచి సిట్ స్వాదీనం చేసుకోలేదు. అయితే కొన్నింటికి రాత పూర్వకంగా సమాధానాలు తీసుకుంది. జూన్ 9న ప్రభాకర్‌ రావు సిట్ ముందు హాజరైన విషయం తెలిసిందే. సిట్‌ అధికారులు ఆయనను దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ముందు ఉంచి ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆయన వాడిన అధికారిక, అనధికారిక సెల్‌ఫోన్లను తమకు అప్పగించాలని సిట్‌ అధికారులు మొదటిరోజు ఆదేశించారు. సెల్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌, మ్యాక్‌ నోట్‌బుక్‌లను సైతం తీసుకురావాలని సూచించారు.

Also Read: Extramarital Affair: ప్రియుడితోనే ఉంటా, నువ్ చచ్చిపో అన్న భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌ రావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా ఉన్నారు. కేసు నమోదైన సమయంలోనే ప్రభాకర్‌ రావు అమెరికా వెళ్లిపోయారు. ఆయన తిరిగి రాకపోవడంతో పోలీసులు పాస్‌పోర్టు రద్దు చేయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్‌ డాక్యుమెంట్‌తో జూన్ 8న రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇప్పటికే ప్రణీత్‌ రావు, రాధాకిషన్‌ రావు, భుజంగ రావు, తిరుపతన్నను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్‌ రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది.