Site icon NTV Telugu

Dharmendra Pradhan: ఇండియా కూటమిని నిజమైన సవాల్‌గా భావిస్తున్నా.. ఎందుకంటే?

Dharmendra Pradhan

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ప్రతిపక్ష ఇండియా కూటమిని నిజమైన సవాల్‌గా భావిస్తున్నానని కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం అన్నారు. తన సొంత రాష్ట్రం ఒడిశా నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనను అనుమతించాలని తన పార్టీని అభ్యర్థించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి దేశానికి సేవ చేయాలనేది బీజేపీ ఎజెండా అని ఆయన అన్నారు. ఏ ఎన్నికలను కూడా బీజేపీ తేలిగ్గా తీసుకోదని.. ఆ కారణంగానే ఇండియా కూటమిని ప్రధాన ఛాలెంజ్‌గా తాను భావిస్తున్నానని చెప్పారు. ఎన్నికలు ఏవైనా బీజేపీ కింది స్థాయి కార్యకర్తల నుంచి అగ్రనేతల వరకూ ప్రతి ఒక్కరూ చాలా సీరియస్‌గా తీసుకుని పనిచేస్తారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమను ముందుండి నడిపిస్తుంటారని తెలిపారు.

Also Read: P20 Summit: జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సమ్మిట్‌కు హాజరుకానున్న కెనడా.. ఈ దేశాలు పాల్గొనవు!

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికపై ఆయన మాట్లాడుతూ, “నేను ఇప్పటికే నా కోరిక గురించి పార్టీకి తెలియజేశాను. నాకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాను, ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి మూడోసారి సేవ చేయాలనేది బీజేపీ ఎజెండా.” అని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. దేశంలోని తల్లులు, సోదరీమణులకు రాజకీయ హక్కులను కల్పించడం ద్వారా ప్రధాని మోడీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. కాంగ్రెస్ తమ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎలాంటి చిత్తశుద్ధి చూపించలేదని, బిల్లు గడువు కూడా తీరిపోయిందని అన్నారు. అవకాశం వచ్చినా వాళ్లు (కాంగ్రెస్) దానిని ఉపయోగించుకోలేకపోయారని విమర్శలు గుప్పించారు.

దేశవ్యాప్త కుల గణన కోసం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేయడంపై ధర్మేంద్ర ప్రధాన్ మాటల దాడి చేశారు. కాంగ్రెస్ హయాంలో, ఆయన కుటుంబ పార్టీ హయాంలో గత 75 ఏళ్లలో ఓబీసీలు, బలహీన వర్గాల కోసం వారు చేసిన పని వివరాలను పంచుకోవాలని అన్నారు.

Exit mobile version