Hyundai Creta EV: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును మరింత సులభతరం చేయడానికి హ్యుందాయ్ (Hyundai) భారీ స్కెచ్ వేసింది. ఎలక్ట్రిక్ SUV అయిన Hyundai Creta Electric కోసం కంపెనీ కొత్తగా Battery-as-a-Service (BaaS) ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా బ్యాటరీ ధరను వాహనం ప్రారంభ ధర నుంచి వేరు చేయడంతో కస్టమర్లు తక్కువ పెట్టుబడితోనే ఈ ఎలక్ట్రిక్ SUVను సొంతం చేసుకోవచ్చు.
ఈ కొత్త BaaS ప్లాన్‌తో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభ ధర కేవలం రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. సాధారణంగా వీటి ధరలు రూ.18.03 లక్షల నుంచి రూ.24.70 లక్షల మధ్య ఉండగా.. కొత్త విధానం వల్ల ప్రారంభ ధరలో దాదాపు రూ.7 లక్షల వరకు తగ్గుదల ఉండనుంది. దీంతో పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి పెట్టలేని వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.
Battery-as-a-Service (BaaS) ఎలా పనిచేస్తుంది?
ఈ ప్లాన్‌లో వాహన యజమాని బ్యాటరీని పూర్తిగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీని సబ్‌స్క్రిప్షన్ విధానంలో ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారులు ప్రతి కిలోమీటర్‌కు రూ.3.90 చెల్లించాలి. అంటే సంప్రదాయ EMIలా నెలవారీ స్థిర చెల్లింపు కాకుండా, వాహనం ఎంత నడిపితే అంత మేరకు బ్యాటరీ వినియోగ ఛార్జీలు చెల్లించే విధానం ఇది. హ్యుందాయ్ ఇంకా వివిధ వేరియంట్లకు సంబంధించిన పూర్తి BaaS ధరలను ప్రకటించలేదు. అయితే తక్కువ ప్రారంభ ధరతో మరింత మంది వినియోగదారులను ఆకర్షించడమే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది.
BaaS అందిస్తున్న ఏడో ఆటోమొబైల్ కంపెనీ:
భారతదేశంలో Battery-as-a-Service కాన్సెప్ట్‌ను మొదటగా JSW MG మోటార్ లోని విండ్సర్ EVతో ప్రారంభించింది. ఆ తర్వాత సిట్రోయెన్, కియా, మారుతి సుజుకి, టొయోట వంటి కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాయి. ఇప్పుడు హ్యుందాయ్ కూడా ఈ జాబితాలో చేరడంతో BaaS సేవలు అందిస్తున్న ఏడో వాహన తయారీ సంస్థగా నిలిచింది. మరోవైపు మహీంద్రా, విన్ ఫాస్ట్ సంస్థలు ఇప్పటివరకు ఈ సేవను అందుబాటులోకి తీసుకురాలేదు.
రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు:
Hyundai Creta ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది.
* 42kWh బ్యాటరీ ప్యాక్ – ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 420 కిలోమీటర్ల వరకు ప్రయాణం.
* 51.4kWh బ్యాటరీ ప్యాక్ – ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 510 కిలోమీటర్ల వరకు ప్రయాణం.
ఈ రెండు వేరియంట్లలోనూ ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) సెటప్ ఉంటుంది. పెద్ద బ్యాటరీ కలిగిన వేరియంట్ 171HP శక్తిని ఉత్పత్తి చేస్తే, స్టాండర్డ్ వేరియంట్ 135HP పవర్‌ను అందిస్తుంది.
కొత్త ఫీచర్స్:
BaaS ప్లాన్‌తో పాటు Creta Electricలో కొన్ని మార్పులను కూడా హ్యుందాయ్ చేసింది. ప్రయాణికులు సులభంగా ఎక్కి దిగేందుకు కొత్త సైడ్ స్టెప్‌ను అందించనుంది. అలాగే ఎంపిక చేసిన HC వేరియంట్లలో 7.4kW AC వాల్ బాక్స్ ఛార్జర్‌ను స్టాండర్డ్‌గా అందిస్తోంది. గతంలో 11kW ఛార్జర్ మాత్రమే అందుబాటులో ఉండేది. ఇంట్లో ఛార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలనుకునే వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

