Site icon NTV Telugu

Hydra: సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు.. క్లారిటీ ఇచ్చిన హైడ్రా…

Hydraa

Hydraa

Hydra: హైడ్రాపై దుష్ప్రచారం జ‌రుగుతోందని.. కొన్ని సామాజిక మాధ్యమాలు ప‌నిక‌ట్టుకొని ఈ ప్రచారం చేస్తున్నాయని హైడ్రా పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎక్కడ ఎవ‌రు కూల్చివేత‌లు చేప‌ట్టినా హైడ్రాకు అంట‌కట్టి దుష్ప్రచారం సాగిస్తూ వ‌స్తున్నాయి. ఇవేవీ ప‌ట్టించుకోకుండా.. ప్రజ‌ల‌కు మేలు చేద్దామ‌ని, మెరుగైన జీవ‌నాన్ని అందిద్దామ‌ని హైడ్రా అహ‌ర్నిశ‌లూ క‌ష్టప‌డుతూ వ‌స్తోంది. ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌మైన న‌గ‌ర నిర్మాణ‌మే ల‌క్ష్యంగా హైడ్రా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే 6 చెరువుల అభివృద్ధిని చేప‌ట్టింది. అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంట‌ను పున‌రుద్ధరించి.. అక్కడ ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని సృష్టించింది. కేంద్ర బృందాలు ప‌లుమార్లు సంద‌ర్శించి అక్కడ హైడ్రా చ‌ర్యలను అభినందించాయి. మ‌రో 13 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక‌ల‌ను సిద్ధం చేస్తోంది. హైడ్రా చ‌ర్యల‌ను ప్రజ‌లు ప‌రిశీలిస్తున్నారు. పెద్ద ఎత్తున మ‌ద్ధతు తెలుపుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కొంత‌మంది స్వార్థ ప్రయోజ‌నాల‌ను ఆశించి సామాజిక మాధ్యమాల ద్వారా హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది హైడ్రా.

READ MORE: Deputy CM Pawan: పులివెందుల, ఒంటిమిట్టలలో ప్రజా తీర్పు.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు!

త‌మ్మిడికుంట ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోనే ప‌నులు..
ఒక‌ప్పుడు మాధాపూర్ ప్రాంతంలోని శిల్పారామం ముందు భారీగా వ‌ర‌ద నీరు నిలిచ‌పోయేది. వాహ‌న రాక‌పోక‌ల‌కు కూడా అంత‌రాయం ఏర్పడేది. న‌గ‌రంలోని ఆరు చెరువుల పున‌రుద్ధర‌ణ‌లో భాగంగా త‌మ్మిడికుంట చెరువును హైడ్రా పున‌రుద్ధరిస్తోంది. ఈ చెరువులో పూడిక తీసి.. వ‌ర‌ద కాలువ‌ను డైవ‌ర్ట్ చేసింది. ఈ కాలువ‌ల్లో పూడిక‌ను కూడా తొల‌గించ‌డంతో ఇప్పుడు అక్కడ వ‌ర‌ద నీరు నిల‌వ‌డంలేదు. చెరువులోకి వ‌ర‌ద నీరు చేరి సాఫీగా కింద‌కు సాగుతోంది. ఈ చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ విష‌యానికి వ‌స్తే.. 2014లో ప్రిలిమ‌న‌రీ నోటిఫికేష‌న్ ద్వారా హెచ్ ఎండీఏ నిర్ధారించింది. 2016లో ఫైన‌ల్ నోటిఫికేష‌న్ ఇచ్చింది. దీని ప్రకారం 29.26 ఎక‌రాలుగా త‌మ్మిడికుంట ఎఫ్‌టీఎల్ ఏరియాను నిర్ధారించింది. ఫైన‌ల్ నోటిఫికేష‌న్ ప్రకార‌మే ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో చెరువు అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయి. ఎన్ క‌న్వెన్షన్ నిర్మాణం కూడా ఈ చెరువు ప‌రిధిలోనే జ‌రిగింది. ప్రముఖ న‌టుడు అక్కినేని నాగార్జున స్వచ్ఛందంగా భూమిని త‌మ్మిడికుంట చెరువు అభివృద్ధికి అప్పగించి.. చట్టపరంగా పరిహారానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోకి 6.12 ఎక‌రాలు శిఖం ప‌ట్టా ల్యాండ్ కూడా వ‌స్తోంది. అయితే ఇది ప్రభుత్వానికి చెందిన‌దిగానే రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అసైన్డ్ ల్యాండ్‌గా ఉన్న ఈ భూమి అమ్మకాలు, కొన‌డాలు జ‌ర‌గ‌కూడ‌దు. కాని జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటూ ఆర్థికంగా స్థిర‌ప‌డిన వెంక‌టేశ్వర‌రావు అనే వ్యక్తి 1.07 ఎక‌రాలు అసైన్డ్ భూమి కొన్నారు. ఇలాగే మ‌రి కొంత‌మంది కూడా కొన్నారు. ప్రభుత్వ భూమినా.. ప్రైవేటుదా అనే వివాదం కోర్టులో ఉంది. ఒక వేళ కోర్టు వెంక‌టేశ్వర‌రావుకు అనుకూలంగా తీర్పు చెబితే.. చట్టపరంగా ప‌రిహారం పొంద‌వ‌చ్చు. వాస్తవాలు ఇలా ఉంటే.. కోర్టు తీర్పును హైడ్రా ప‌ట్టించుకోవ‌డంలేదంటూ మీడియాలో వార్తలు రావ‌డాన్ని హైడ్రా ఖండిస్తోంది. హైడ్రాకు చ‌ట్టాలు, కోర్టులు అంటే ఎంతో గౌర‌వం ఉంది. కోర్టు ఆదేశాల‌మేర‌కు ప‌లు కార్యక్రమాల‌ను పూర్తి చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ప‌నులు చేసుకోవ‌చ్చున‌ని మిన‌హాయింపు కూడా ఇచ్చింది. ఆ ప్రకార‌మే ప‌నులు జ‌రుగుతున్నాయ‌నేది కొంత‌మంది మీడియా ప్రతినిధులు గ్రహించాలి.

READ MORE: Hyderabad: నోటికి ప్లాస్టర్ వేసి.. కళ్ళల్లో పెన్సిల్‌తో పొడిచి.. రెండో తరగతి విద్యార్థిపై టీచర్ దాడి..

గ‌తంలో ఈవీడీఎం రంగులే.. అసహజ రంగులు లేవు
గ‌తంలో జీహెచ్ ఎంసీలో భాగంగా ఉన్న ఈవీడీఎం (Enforcement, Vigilance & Disaster Management) వాహ‌నాల‌కు వాడే రంగులే కొన‌సాగుతున్నాయి. 7 ఏళ్లుగా ఇవే రంగులు కొనసాగుతున్నాయనే విషయం మీడియా గుర్తించాలి. గ‌తంలో ఈవీడీఎం అని ఉంటే.. ఇప్పుడు హైడ్రా పేరుతో ఉన్నాయి. అక్షరాలు మారాయి, లోగో మారింది త‌ప్ప రంగు మార‌లేదు. అస‌హ‌జ రంగులు ఎక్కడా లేవని పేర్కొంది. కానీ కొన్ని సామాజిక మాధ్యమాల్లో అసహజ రంగులాంటూ వార్తలు రావడం పట్ల విచారం వ్యక్తం చేసింది.

READ MORE: Rahul Gandhi: రాజీవ్ గాంధీపై ‘చనిపోయిన వ్యక్తి’ పోటీ చేశారు.. రాహుల్‌గాంధీకి ఈ కథ తెలియదా..?

హైడ్రాకు సంబంధం లేకపోయినా..
కూకట్పల్లి – హైటెక్ సిటీ వంతెన వద్ద వర్షం నీరు నిలిచిపోతే ట్రాఫిక్, GHMC అధికారులు కలసి వంతెన పారాపెట్ వాల్ కి రంధ్రం చేసి నీటిని బయటకు పంపారు. ఇక్కడ వంతెన స్ట్రక్చర్ దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయాన్ని స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కూడా ధృవీకరించారు. సదుద్దేశంతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగ కుండా చేసిన పనికి లేనిపోని దురుద్దేశాలు ఆపాదించడం తగదు. ఈ పనితో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేకపోయినా హైడ్రాకు అంటకట్టి ఒక పద్ధతి ప్రకారం కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ఒకటి రెండు అంశాలలోనే కాదు.. గతంలోనూ అనేక విషయాలపై దుష్ప్రచారం చేశారు. ప్రజలు ఈ విషయాలను అర్థం చేసుకోవాలని, వాస్తవాలను గ్రహించాలని హైడ్రా విజ్ఞప్తి చేస్తోంది.

Exit mobile version