Site icon NTV Telugu

Cyber Crime: వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో టోకరా.. హైదరాబాద్ మహిళ ఆత్మహత్య!

Telegram Job Scam

Telegram Job Scam

ప్రస్తుతం ‘సైబర్ నేరగాళ్లు’ ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవరీ అర్ధం కావడం లేదు. మెసేజెస్, కాల్స్, బెదిరింపులు, లోన్స్, డిజిటల్‌ అరెస్టు.. ఇలా అనేక రూపాల్లో జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో మాత్రం చిక్కకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అంటూ ఓ మహిళను సైబర్‌ నేరస్తులు మోసం చేశారు. మోసానికి కలత చెందిన ఆ మహిళ చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని చోటుచేసుకుంది.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కంచుస్తంభంపాలెం వాసి అనూషకు దగ్గరి బంధువైన వెంకన్న బాబుతో ఐదేళ్ల కిందట వివాహం అయింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని తులసీనగర్లో నివాసం ఉంటున్నారు. అనూష టెలిగ్రామ్ యాప్‌లో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అంటూ ప్రకటన చూసి ఫాలో అయింది. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ముందు రూ.1000 కట్టింది. దీంతో ఆమెకు రూ.7 వేలు వచ్చినట్టు యాప్‌లో చూపెట్టింది. యాప్‌లో డబ్బులు కనిపిస్తున్నా.. బ్యాంకు ఖాతాలోకి మాత్రం బదిలీ అవలేదు. బ్యాంకు ఖాతాలోకి డబ్బులు బదిలీ అవ్వాలంటే.. ఇంకా కొంత డబ్బులు పెట్టుబడి పెట్టాలని చెప్పారు. సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలకు ఆకర్షితురాలైన అనూష.. తన దగ్గర ఉన్న బంగారం అమ్మి పెట్టుబడి పెట్టింది.

Also Read: IND vs ENG 3rd Test: లార్డ్స్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా పేస్ గుర్రం వచ్చేశాడు!

సుమారు లక్ష రూపాయల వరకు అనూష పెట్టుబడులు పెట్టింది. పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయని భావించింది. అయితే సైబర్ నేరగాళ్లు స్పదించలేదు. చివరికి తాను సైబర్ నేరగాల మోసానికి బలి అయ్యానని గుర్తించింది. సైబర్ మోసానికి అనూష కలత చెందింది. గురువారం కుమారుడిని నిద్రపుచ్చి.. అనూష ఇంట్లోని ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు ముందు అనూష లేఖ రాసింది. తన మాదిరి టెలిగ్రామ్ యాప్ వలలో పడి మోసపోవద్దని, బాబు జాగ్రత్త అంటూ లేఖ రాసింది. టెలిగ్రామ్ యాప్ మొత్తం మోసాల పుట్టని పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version