Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..

Hyderabad Woman Allegedly

Hyderabad Woman Allegedly

Hyderabad: హైదరాబాద్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మయన్మార్‌కు చెందిన 18 ఏళ్ల వివాహితను ఆమె భర్తే ఇంట్లో బంధించి, తన ముగ్గురు స్నేహితులతో వరుసగా అత్యాచారానికి ఒడిగట్టించిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అక్టోబర్ 23న ఇంటి యజమాని బకాయి ఉన్న అద్దె వసూలు చేయడానికి వచ్చి, తాళం పగులగొట్టడంతో ఈ దారుణం బయటపడింది.

బాధితురాలు హుమైరా తమన్నా ఫిర్యాదు ప్రకారం… ఆమె బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లో ఉంటున్న సమయంలో మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఫయాజ్, మే నెలలో ఆమె కుటుంబసభ్యులకు చెప్పకుండా భారత్‌కు తీసుకువచ్చాడు. హైదరాబాద్ వచ్చాక మూడు, నాలుగు రోజుల్లోనే ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నెల రోజుల తర్వాత, ఫయాజ్ మయన్మార్‌కు చెందిన తన ముగ్గురు స్నేహితులు అహ్మద్ ముజీబ్, నూర్ కమల్, జియా-ఉర్-రెహమాన్‌లను తాము ఉంటున్న అద్దె ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత అసలు నరకం ప్రారంభమైంది. భర్త ఫయాజ్ బయటకు వెళ్తూ ఇంటికి బయటి నుంచి తాళం వేసి, తన స్నేహితులను లోపలికి పంపేవాడు. వారు ఆమెపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టేవారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని అందులో ఇద్దరు ఆమెను తీవ్రంగా బెదిరించారు. భాష తెలియకపోవడం, ఎవరిని సహాయం అడగాలో పాలుపోకపోవడంతో పాటు భయం వల్ల ఆమె ఈ అకృత్యాన్ని వెంటనే బయటకు చెప్పలేకపోయింది.

అక్టోబర్ 23న అద్దె డబ్బుల కోసం వచ్చిన ఇంటి యజమాని, బయట తాళం వేసి ఉండటంతో దాన్ని పగులగొట్టి తెరవడంతో గుట్టురట్టైంది. వెంటనే మరొకరి మొబైల్ ఫోన్ సాయంతో బాధితురాలు బంగ్లాదేశ్‌లోని తన కుటుంబసభ్యులకు సమాచారం అందించగా, వారు ఇక్కడ ఉన్న బంధువులకు విషయం చెప్పారు. దాంతో ఆమెను బంధువుల ఇంటికి తరలించారు. అక్టోబర్ 26న బాధితురాలి బంధువు మహమ్మద్ రషీద్ ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆ నలుగురిపై అత్యాచారం, అక్రమ బంధనం, క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.