Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వన్ వే ట్రాఫిక్ విధానం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రెండు లైన్ల రోడ్లలో ఇకపై ఒకే దిశలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు ఉన్న రెండు రోడ్లలో ట్రాఫిక్‌ను అనుమతించేలా ఏర్పాట్లు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వన్ వే అమలు కోసం అవసరమైన నిర్మాణ, ట్రాఫిక్ ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఇదే మార్గంలో వన్ వే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఆగస్టు 18 నుంచి పూర్తి స్థాయిలో వన్ వే అమలు చేయాలని నిర్ణయించారు.
కొత్త ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ముందుగానే తమ ప్రయాణ మార్గాలను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ప్రయాణించే వారు వన్ వే మార్గాలను గమనించి, అవసరమైతే ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని కోరారు. వన్ వే అమలు వల్ల ప్రయాణ దూరం కొంత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. వాహనాలు మార్గమధ్యలో ఎక్కువసేపు నిలిచిపోకుండా ట్రాఫిక్ సాఫీగా సాగుతుందని పోలీసులు తెలిపారు. అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
అలాగే కేబీఆర్ పార్క్‌కు వాకింగ్ కోసం వచ్చే వారి కోసం రోడ్డు దాటేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాకర్లు రోడ్డు దాటే సమయంలో ఏర్పాటు చేసిన మార్గాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా కేబీఆర్ పార్క్ పరిసర రోడ్లపై వాహనాలను ఇష్టానుసారంగా పార్క్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. వన్ వే అమలు నేపథ్యంలో రోడ్లపై వాహనాలను నిలిపివేయడం వల్ల ట్రాఫిక్‌కు మరింత అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున వాహనదారులు సహకరించాలని కోరారు.అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..

