Electric Shock: విద్యుత్ తీగ తగిలి విద్యార్థిని మృతి, మరో బాలికకు గాయాలు..!

Electric Shock

Electric Shock

Electric Shock: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని నైట్ ఏంజెల్ హోమ్‌లో విద్యుత్ షాక్‌కు గురై ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో హోమ్‌లో విషాదం నెలకొంది. అందిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో హోమ్‌లోని విద్యార్థినులు వెనుకవైపు ఉన్న గేట్ గ్రిల్ ద్వారా రెండో అంతస్తుకు వెళ్లారు. మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వెళ్లకుండా తలుపు వద్ద గ్రిల్ ఏర్పాటు చేసినప్పటికీ, హాస్టల్ వెనుక ఉన్న గేట్ నుంచి పైకి చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఆడుకుంటుండగా మూడో తరగతి చదువుతున్న రెబెకాకు విద్యుత్ తీగ తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ఘటనలో మరో విద్యార్థిని నందిని చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థిని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. సమాచారం అందుకున్న హోమ్ ఇన్‌చార్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ముషీరాబాద్ పోలీసులు వివరాలు సేకరించారు. విద్యుత్ షాక్‌కు గురైన నందినిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. మృతి చెందిన రెబెకా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినులు రెండో అంతస్తుకు ఎలా చేరుకున్నారు.? అక్కడ విద్యుత్ తీగలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు.