Cyber frauds: సాంకేతికత అభివృద్ధి చెందడంతో మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ దాడుల ద్వారా అమాయకుల ఖాతాల్లోని నగదును కాజేసేందుకు రోజుకో కొత్త ముఠా పుట్టుకొస్తుంది. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగించిన దొంగలు ఇప్పుడు ఇండియాలో గుమిగూడి సంపన్నులను దోచుకుంటున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు పోలీసులు ‘గోల్డెన్ అవర్ ‘పై అవగాహన కల్పిస్తున్నారు. సగటున హైదరాబాద్ వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు రోజూ కోట్లాది రూపాయలను దోచేస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో సైబర్ నేరాల కారణంగా 140 కోట్ల వరకు నష్టం వాటిల్లగా, 44 కోట్లు ఫ్రీజ్ అయ్యాయని, అందులో కేవలం 2 కోట్లలోపే బాధితులకు తిరిగి రావచ్చని గణాంకాలు చెబుతున్నాయి.
అత్యాశతో సైబర్ నేరగాళ్ల బారిన పడేది బాగా చదువుకున్నవారేనని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. కానీ తాము మోసపోతున్నామని గ్రహించిన 2 గంటలలోపు (గోల్డెన్ అవర్స్) 1930కి ఫోన్ చేసి సహాయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ క్రైమ్‌లో మొదటి రెండు గంటలు చాలా ముఖ్యమైనవి. నేరస్థుడి ఖాతాను స్తంభింపజేయడానికి మరియు డబ్బును రికవరీ చేయడానికి ఈ ‘గోల్డెన్ అవర్’ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Read Also:Russia election 2024: రష్యాలో ఎన్నికలు.. కేరళలో ఓటింగ్.. ఎందుకో తెలుసా..?
పార్ట్ టైమ్ ఉద్యోగాలు, ట్రేడింగ్, కొరియర్ల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీప్ ఫేక్ తరహాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి పోలీసుల పేరుతో ఫోన్లు చేసి వీడియో కాల్స్ లో యూనిఫాంలో కనిపిస్తారని తెలుస్తోంది. క్షేత్ర సాయిలోని సమస్యల పరిష్కారానికి బ్యాంకర్లు, సోషల్ మీడియా మేనేజర్లతో పోలీసులు త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవసరమైతే సినీ తారల సాయం కూడా తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు.