Hyderabad: హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు10 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు యువకులను గమనించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఐదుగురూ ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరి ద్వారా సరఫరా జరుగుతోంది అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. ఈ ఘటనతో పంజాగుట్ట ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. కాలేజీ విద్యార్థుల్లో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్న పోలీసులు, డ్రగ్ సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను బయటపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
READ MORE: Nuke Testings: 40 లక్షల మంది హ*త్య.. సంచలనం రేపుతోన్న నివేదిక.. ఈ పాపం ఎవరిది?
