Hyderabad Online Betting: భారీ ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..

Hyderabad Online Betting

Hyderabad Online Betting

Hyderabad Online Betting: తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాపై సీఐడీ భారీ ఆపరేషన్ నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించింది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన ముఠాకు చెందిన 13 మందిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు నిర్వహించిన దాడుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడిలో భాగంగా సీఐడీ చీఫ్ చారు సిన్హా వెల్లడించిన వివరాల ప్రకారం.. “డఫాబెట్” యాప్‌తో పాటు www.dafabet.com వెబ్‌సైట్ ద్వారా క్రికెట్, క్యాసినో గేమింగ్ పేరుతో అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను గుర్తించారు. ఈ నెట్‌వర్క్ ద్వారా కోట్లాది రూపాయలు వసూలు చేసి భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. సీఐడీ దర్యాప్తులో ఈ బెట్టింగ్ మాఫియా కార్యకలాపాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్లు బయటపడింది. ఫిలిప్పీన్స్‌లో ప్రారంభమైన ఈ నెట్‌వర్క్ తరువాత యునైటెడ్ కింగ్‌డమ్‌కు విస్తరించి.. ప్రస్తుతం దుబాయ్ నుంచి నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

×
×
Ad

ముఠాలో కొందరు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సృష్టించడం, మరికొందరు వాటిని నిర్వహించడం, ఇంకొందరు సాంకేతిక సహాయం అందించడం వంటి బాధ్యతలు చేపట్టినట్లు తేలింది. ఈ కేసులో భాగంగా 46 మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసినట్లు సీఐడీ వెల్లడించింది. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్ నిర్వాహకులు రోజుకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నట్లు సీఐడీ దర్యాప్తులో బయటపడింది. కరీంనగర్‌ లో నమోదైన డఫా బెట్ కేసు ఆధారంగా ప్రారంభమైన దర్యాప్తు 15 రోజుల పాటు కొనసాగగా, సుమారు 40 మంది అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో 414 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే 108 ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను గుర్తించి వాటిని బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపించారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో 37 ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్లపై జియో-ఫెన్సింగ్ అమలు చేసి, తెలంగాణలో మాత్రమే అవి అందుబాటులో లేకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

డఫాబెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు నమోదైనట్లు సీఐడీ వెల్లడించింది. ఇది పాన్-ఇండియా స్థాయిలో నడుస్తున్న పెద్ద బెట్టింగ్ మాఫియా వ్యవస్థగా గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను కూడా సీఐడీ గుర్తించింది. వారిని ఇప్పటికే కౌన్సెలింగ్ చేసినట్లు చారు సిన్హా తెలిపారు. “బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారికి ఒక అవకాశం ఇచ్చాం. వారిని కౌన్సెలింగ్ చేశాం. ఇకపై మళ్లీ ఇటువంటి ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారాలపై ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను సీఐడీకి బదిలీ చేసి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ పేరుతో యువతను, సాధారణ ప్రజలను మోసం చేస్తున్న ముఠాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని సీఐడీ హెచ్చరించింది.