Marriage Cancel : కాసేపట్లో పెళ్లి జరగబోతోంది. బంధువులంతా వచ్చారు. విందు భోజనాలు సిద్ధమయ్యాయి. మరికొన్ని క్షణాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టాలి.. ఉన్నట్లుండి మండపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వారు రావడంతోనే ఈ పెళ్లి ఆపమని గద్దించారు. ఇంకేముంది అంతా షాక్ తిన్నారు. ఏం జరుగుతుందో కూడా అక్కడి వారికి అర్థం కాలేదు. ఈ క్రమంలో జరిగిన విషయాన్ని పోలీసులు వివరించడం మొదలు పెట్టారు. అది విన్న అమ్మాయి తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఎందుకంటే అక్కడ పెళ్లి ఆపడానికి కారణం పెళ్లికూతురే.. అసలు విషయం ఏంటంటే.. పెళ్లి కూతురికి పెళ్లంటే ఇష్టం లేదు. కారణం ఆమె వయసు 17ఏళ్లు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. తనను 30ఏళ్ల వ్యక్తికి ఇష్టం లేకున్నా ఇచ్చి పెళ్లిచేస్తున్నారని.. తనకు సాయం చేయాల్సిందిగా పోలీసులకు వీడియో తీసి పంపింది. ఇప్పుడే పెళ్లొద్దని ఎంత వారిస్తున్నా.. పట్టించుకోవట్లేదని. పెళ్లి చేసుకోవాల్సిందేనని లేకపోతే చచ్చిపోతామని పేరెంట్స్ బెదిరిస్తున్నారని అమ్మాయి ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. మరికొన్ని గంటల్లో వివాహం ఉందనగా నూతన వస్త్రధారణలో ఉన్న ఓ పెళ్లి కూతురు వివాహ పత్రిక, ఆధార్ కార్డు, ముహూర్తం, పెళ్లి జరిగే ప్రాంతం తదితర వివరాలను వీడియో తీసి రాచకొండ పోలీసులకు పంపించింది.
Read Also: Nizamabad Crime: బెంచీ మీద కూర్చునే విషయంపై విద్యార్థుల మధ్య గొడవ.. ఛాతీపై బలంగా..
వెంటనే అప్రమత్తమైన పోలీసులు పెళ్లి మండపానికి చేరుకొని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలికను వనస్థలిపురంలోని సఖి కేంద్రానికి తరలించారు. ఇరు పక్షాల కుటుంబ పెద్దలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన గురువారం హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో పరిధిలో చోటు చేసుకుంది. రాచకొండ పోలీసు కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్.. హయత్‌నగర్ ఠాణా డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఆర్ నిరంజన్, ఎస్‌ఐ ఎన్ సూర్య, షీ టీమ్ ఏఎస్‌ఐ రాజేందర్ రెడ్డి, మహిళా కానిస్టేబుల్ అనుష్క, చైల్డ్ హెల్ప్‌లైన్ కో–ఆర్డినేటర్ నరేష్‌లను అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి పంపించి బాల్య వివాహానికి అడ్డుకట్ట వేయడంతో కథ సుఖాంతమైంది. ఫోన్ చేస్తే అమ్మాయి తల్లిదండ్రులు అప్రమత్తమవుతారని గ్రహించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా పెళ్లి జరిగే చోటుకు చేరుకున్నట్లు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. కాగా.. మండపం నుంచి పోలీసులు వెళ్లిపోయే వరకూ పెళ్లి కూతురును బయటికి రానివ్వకుండా 2–3 గంటల పాటు గదిలోనే బంధించారు. భయభ్రాంతులకు గురి చేయడంతో పోలీసులు మైనర్‌ను ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులు పెళ్లి కూతురితో ఏకాంతంగా మాట్లాడి విషయాన్ని రాబట్టారు.
Read Also:Hyderabad Traffic: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజధానిలో ట్రాఫిక్ ఆంక్షలు