Site icon NTV Telugu

Hyderabad Metro: మెట్రో రైలులో గుండె, ఊపిరితిత్తుల తరలింపు.. 45 నిమిషాల్లోనే 2 ఆస్పత్రులకు!

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro Saves Two Lives with Organ Transport: హైదరాబాద్ మెట్రో రైలు ఈ ఏడాది నాలుగోసారి ప్రాధాన్యతా వైద్య రవాణా సౌకర్యాన్ని కల్పించింది. జీవితాన్ని కాపాడే గుండె, ఊపిరితిత్తులను మంగళవారం (సెప్టెంబర్ 2) రెండు వేర్వేరు ఆస్పత్రులకు తరలించింది. సకాలంలో అవయవాలను అమర్చడంతో ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్లయింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య విజయవంతంగా ఈ రవాణాను చేపట్టారు. ఓ దాత నుంచి లభించిన గుండె, ఊపిరితిత్తులు.. హైదరాబాద్ మెట్రోలో అత్యవసర వైద్య రవాణా ద్వారా సురక్షితంగా తరలించబడ్డాయి.

కామినేని ఆస్పత్రి (ఎల్‌బీనగర్‌)లో ఓ దాత నుంచి సేకరించిన గుండెను యశోద హాస్పిటల్ (పరేడ్ గ్రౌండ్స్)కు హైదరాబాద్ మెట్రో రైలులో తరలించారు. 8 స్టేషన్ల మధ్య గల 11 కిమీ దూరాన్ని కేవలం 16 నిమిషాల్లోనే పూర్తి చేశారు. ఎల్‌బీనగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి గుండెను మాధాపూర్ యశోద ఆస్పత్రికి చేర్చారు. 21 స్టేషన్ల మధ్య గల 27 కిమీ దూరాన్ని 43 నిమిషాల్లో పూర్తి చేశారు. భారీ వర్షాలు, పీక్ అవర్ ట్రాఫిక్ మధ్య జరిగినప్పటికీ.. ఈ ప్రాణరక్షక రవాణా 45 నిమిషాల లోపే పూర్తయింది. దీంతో వైద్య అత్యవసరాల సమయంలో హైదరాబాద్ మెట్రోనే అత్యంత నమ్మదగినదిగా, వేగవంతమైనదిగా మరోసారి నిరూపితమైంది.

Also Read: BCCI: టైటిల్‌ స్పాన్సర్‌ వేటలో బీసీసీఐ.. ఆ కంపెనీలకు నో ఛాన్స్!

ఈ కీలకమైన మిషన్ విజయవంతం కావడానికి హైదరాబాద్ మెట్రో రైలు, వైద్య నిపుణులు సహా ఆసుపత్రి అధికారుల సమన్వయం కీలక పాత్ర పోషించింది. ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు (హైదరాబాద్) లిమిటెడ్ అత్యవసర సేవలకు అండగా నిలుస్తూ, ప్రాణాలను రక్షించడంలో నగరానికి జీవనాధారంగా కొనసాగుతుంది. 45 నిమిషాల వ్యవధిలోనే గుండె, ఊపిరితిత్తులను రెండు ప్రాంతాలకు తరలించామని ఎల్‌ అండ్‌ టీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Exit mobile version