Hyderabad: హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సమీపంలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను ఓ కారు ఢీకొట్టింది. తన కారు ఎక్కుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది గమనించిన కుటుంబీకులు ఖాజాను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని గంటలకే అడ్వకేట్ మృతి చెందారు. ఇక ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. మొదట ఈ ఘటనను హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసిన పోలీసులు, తరువాత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో.. వక్ఫ్ బోర్డ్ భూముల వివాదంలోనే హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వివాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు.. ఈ ఘటనపై ఖాజా మొయినుద్దీన్ స్నేహితురు అడ్వకేట్ శ్యామ్ కుమార్ NTVతో మాట్లాడారు. “పక్కా రెక్కీ చేసి మాసబ్ ట్యాంక్‌లో ఖాజాను కార్‌తో గుద్ది హత్య చేశారు. నెంబర్ ప్లేట్ లేకుండా కారుతో ఢీకొట్టి చంపేశారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మలక్‌పేట్‌లో వక్ఫ్ ఆస్తులు, భూమి విషయాలకు సంబంధించి ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్‌లతో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌కు వివాదాలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా నిందితులు ఇద్దరూ న్యాయవాదికి హాని తలపెట్టడానికి ప్రయత్నించారు. గతంలో ఖాజా ఈ అంశంపై హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసు అరెస్ట్ చేసి ప్రత్యర్థులను రిమాండ్ తరలించారు. దీనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. చనిపోయే ముందు నాతో కొద్దిసేపు మాట్లాడారు. ఆయన ఎక్కువగా వక్ఫ్ భూముల తగాదాల కేసులు వాదిస్తారు. రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ కరువైంది. ఈ అంశంపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ వక్ఫ్ బోర్డు భూముల వివాదంలో ఓ కాలేజీ మెనేజ్‌మెంట్ ఇన్వాల్వ్ ఉంది.” అని ఖాజా మిత్రుడు అడ్వకేట్ శ్యామ్ కుమార్ వివరించారు.
