Hyderabad: హైదరాబాద్‌లో వెలుగు చూసిన అక్రమ అండాల (సరోగసి/ఐవీఎఫ్) దందా కలకలం రేపుతోంది. నగరంలోని ప్రముఖ ఫెర్టిలిటీ కేంద్రాలైన ‘ఒయాసిస్’, ‘సద్గురు’ సెంటర్లపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు దాని డైరెక్టర్ డాక్టర్ గేదెల దుర్గారావు, పలువురు ఏజెంట్లపై కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణాల గుట్టు రట్టయింది.
ఈ దందాలో భాగంగా బేగంపేటలోని ‘అమి నీతా గర్ల్స్ హాస్టల్’పై పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ తనిఖీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 12 మంది మహిళలను అధికారులు సురక్షితంగా రక్షించారు. నిరుపేద మహిళలకు రూ. 50 వేల డబ్బు ఆశచూపి ఇతర రాష్ట్రాల నుంచి వారిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఎలాంటి వైద్య పర్యవేక్షణ, నిబంధనలు పాటించకుండా ఈ ముఠా మహిళలకు ప్రమాదకరమైన హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు గుర్తించారు. అండాల సేకరణ సమయంలో ఒకవేళ 7 కంటే తక్కువ అండాలు వస్తే, ఏజెంట్ కమీషన్లో ఏకంగా 50 శాతం కోత పెట్టేవాళ్లని తేలింది. ఎక్కువ డబ్బు సంపాదనే ధ్యేయంగా మహిళల ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వారికి పరిమితికి మించి హార్మోన్ డోసులు ఇచ్చి ఇబ్బందులకు గురిచేశారు.
ఈ ముఠా ఇప్పటివరకు సుమారు 66 మంది మహిళల నుంచి అండాలను సేకరించగా, అందులో 19 మందికి సంబంధించిన రికార్డులను పూర్తిగా మాయం చేయడం గమనార్హం. అంతేకాకుండా, ఎలాంటి అనుమతులు లేని గచ్చిబౌలి, ఉప్పల్, మలక్‌పేట, టోలీచౌకి ప్రాంతాల్లోని క్లినిక్‌లకు ఈ అండాలను సరఫరా చేసినట్లు తేలింది. ఈ వ్యవహారంపై BNS, ART (అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ) చట్టాల కింద Cr.No 426/2026 గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అమిత్ శర్మ, నిఖత్ శర్మ, దీపిక సహా మొత్తం 9 మంది ఏజెంట్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

