Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హఫీజ్ బాబా నగర్‌లో తెల్లవారుజామున హత్య తీవ్ర కలకలం రేపింది. సయ్యద్ ఒమర్ అలియాస్ మషల్లా ఒమర్ అనే యువకుడిని దుండగులు కత్తులతో దారుణంగా నరికి చంపారు. తీవ్ర గాయాలపాలైన ఒమర్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దాడి జరుగుతున్న సమయంలో ఒమర్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన సయ్యద్ అనే మరో వ్యక్తిపై కూడా దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ను చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ హత్యకు అమన్ ఖురేషి, అలీ భైసా అనే వ్యక్తులు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడు ఒమర్‌కు పాత నేర చరిత్ర ఉందని, అతను మద్యం, గంజాయి మత్తులో ఓ గ్యాంగ్‌ను ఏర్పరచుకుని స్థానికులను బెదిరించడం, దాడులకు పాల్పడటం, వసూళ్లకు తెగబడటం వంటి అరాచకాలు చేసేవాడని తెలుస్తోంది. పాత కక్షలు లేదా గ్యాంగ్ వార్ ఈ హత్యకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు. హత్యకు దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులు, నిందితుల ఆచూకీ కోసం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ పోలీసులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు.

