Hyderabad: అర్ధరాత్రి నగరానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేడు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ

Rahul Gandhi

Rahul Gandhi

Hyderabad: హైదరాబాద్ నగరం నేడు గిగ్ వర్కర్ల భారీ ప్రదర్శనకు వేదిక కానుంది. సామాజిక భద్రత, కార్మిక హక్కులు, సంక్షేమ చర్యలను డిమాండ్ చేస్తూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) పిలుపునిచ్చిన ఈ మహా ర్యాలీ శిల్పకళా వేదిక నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ) వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇప్పటికే శుక్రవారం అర్ధరాత్రి నగరానికి చేరుకున్నారు. రాత్రి నోవాటెల్‌లో బస చేశారు. శనివారం ఉదయం లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఆసియా నాయకులతో, అమెరికా, యూరోపియన్‌ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 3 గంటలకు సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తారు.

2023 భారత్ జోడో యాత్ర, అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో గిగ్ కార్మికులకు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ‘తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యాక్ట్-2026’ను రూపొందించింది. నేటి బహిరంగ సభ వేదికపై రాహుల్ గాంధీ ఈ కొత్త చట్టాన్ని, సంక్షేమ పథకాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. దీనితో పాటు కార్మికుల నమోదు, ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌ను కూడా ఆవిష్కరిస్తారు. ఈ చట్టం అమల్లోకి రావడం వల్ల డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్ సేవల కార్మికులకు తప్పనిసరి రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, ప్రమాద బీమా, ప్రత్యేక సంక్షేమ బోర్డు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి వాటికి చట్టబద్ధమైన హామీ లభించనుంది. ప్రభుత్వ నిర్ణయాలపై టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ హర్షం వ్యక్తం చేస్తూ, రాజకీయాలకు అతీతంగా ప్రతి గిగ్ కార్మికుడికి గౌరవం, సామాజిక భద్రత కల్పించడమే తమ ఉద్యమ లక్ష్యమని తెలిపారు. చట్టం ద్వారా లభించిన హక్కులను పూర్తిస్థాయిలో, మెరుగైన పద్ధతిలో అమలు చేయాలని కోరుతూ నేటి ర్యాలీలో కార్మికులు తమ గళాన్ని వినిపించనున్నారు.