Malakpet Deer Meat Case: హైదరాబాద్‌లో జింక మాంసం పట్టుబడింది. మలక్‌పేటలో వాహనాల తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ మహీంద్రా స్కార్పియోను పోలీసులు తనిఖీ చేయగా.. అందులో జింక మాంసంతో పాటు తుపాకీ, బుల్లెట్లు, వేటకు ఉపయోగించిన పలు పరికరాలు లభించాయి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను మలక్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొబైల్స్, ఆయుధాలు, ఇతర సామగ్రితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మలక్‌పేట రేస్‌కోర్స్ రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. మహీంద్రా స్కార్పియో అనుమానాస్పదంగా కనిపించింది. కారును తనిఖీ చేయగా.. లైసెన్స్ కలిగిన 30-06 స్పోర్టింగ్ రైఫిల్, 8 లైవ్ బుల్లెట్లు, 12 ఖాళీ కార్ట్రిడ్జ్‌లు గుర్తించారు. అంతేకాకుండా వేటకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న రెండు నైట్ విజన్ టెలిస్కోప్‌లు, రీచార్జబుల్ బ్యాటరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సయ్యద్ హుస్సేన్, సయ్యద్ ఒమర్, మహమ్మద్ హమీద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద లభించిన ఆయుధాలు, ఇతర సామగ్రి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితులు కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లా చించోళి తాలూకా పరిధిలోని చిమ్మన్‌చోడ్ అటవీ ప్రాంతానికి జింకల వేట కోసం వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. లైసెన్స్ కలిగిన తుపాకీతో ముగ్గురూ కలిసి మొత్తం 12 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. వేటకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు భావిస్తున్న హువావే ఫోల్డబుల్ మొబైల్ ఫోన్‌ను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఆధారాల సేకరణపై పోలీసులు దృష్టి సారించారు. నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, రైఫిల్, బుల్లెట్లు, ఇతర పరికరాలతో పాటు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఆర్మ్స్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టంతో పాటు సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 391/2026గా కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ కె. వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

