మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహిళా భవనం వెనుక నివాసముంటున్న సూరజ్ కుమారుడు అఘమ్ సింగ్ అలియాస్ రాఘవ (8) ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ ప్రాంతానికి చెందిన దంపతులు నగరానికి వలసవచ్చి లక్ష్మీగూడలో నివసిస్తున్నారు. బాలుడి తండ్రి కాటేదాన్‌లోని ధనలక్ష్మి మెటల్ కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ రోజూలాగే పనులకు వెళ్లగా, ఇంట్లో ఎనిమిదేళ్ల రాఘవతో పాటు అతని ఐదేళ్ల చెల్లెలు ప్రజ్ఞ మాత్రమే ఉన్నారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలుడు ఉరివేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న చిన్నారి చెల్లెలు ఈ ఘటనను గమనించింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్న వయసులోనే బాలుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

